నిద్రలోకి జారుకునే అసాధారణ మానసిక స్థితి లోనే మనుషుల ఆవిష్కరణ శక్తి పెరుగుతుందని గతంలో యూఎస్ ఇన్వెంటర్ థామస్ ఎడిసన్ వంటి వ్యక్తులు తెలిపారు. ఈ ఆలోచనలు తాజా అధ్యయనం కూడా బలపరిచింది. నిద్ర ప్రారంభదశలో ఉన్న వ్యక్తులను మేల్కొలిపినప్పుడు కష్టతరమైన గణిత సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని పొందుతారని కనుగొంది. ప్రజలు నిద్రలోకి జారుకున్నప్పుడు హిప్నాగోజియా లేదా N1అనే స్థితిలో కొన్ని నిమిషాలు గడుపుతారు.ఈ స్థితిని స్పష్టమైన కలల  ద్వారా వర్ణించవచ్చు. అయితే గాఢ నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ఆ కలలను మర్చిపోతారు. ఇక ఎడిసన్ విషయానికొస్తే తను క్లిష్ట సమస్యలు ఎదుర్కొన్నప్పుడు.. గాఢ నిద్రలోకి జారుకునే ముందు తనను తాను మేల్కొనేలా చేసుకోవడం ద్వారా ఈ స్థితిని అనుభవించాడు.

చేతిలో ఒక స్టీల్ బాల్ పట్టుకుని ఆయన ఈ ఎక్స్పరిమెంట్ చేయగా స్పృహ కోల్పోయినప్పుడు బంతి కింద పడేది.ఆ శబ్దానికి లేచిన తర్వాత మరింత యాక్టివ్ గా పని చేసేవాడు. ప్యారిస్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ రీసెర్చ్ లో పనిచేసిన డెల్ఫీన్ ఒడియేట్ బృందం..103 మంది వ్యక్తులకు మ్యాథ్స్ టాస్క్ ను అప్పగించి పరీక్షించింది. ఒక చీకటి గదిలో ఏర్పాటు చేసిన వాలు కుర్చీలో కళ్ళు మూసుకొని పడుకోవాలని సూచించింది. ఎడిసన్ టెక్నిక్ మాదిరిగానే వారి చేతికి ఒక బాటిల్ ఇచ్చి నిద్రపోమ్మన్నారు. అలా నిద్రలోకి జారుకున్నాక బాటిల్ కింద పడిన శబ్దం తో మేల్కొన్నారు. ఈ పద్ధతిలో 24 మంది కనీసం ఒక 30 సెకండ్ల N1 ఎపిసోడ్ నిద్రను అనుభవించగా.. మరో 14 మంది N1 ద్వారా గాఢనిద్రలోకి వెళ్లారు. ఇక మిగిలిన వారు అస్సలు నిద్ర పోలేదు. స్లీప్ ఎపిసోడ్ తర్వాత చేపట్టిన మ్యాథ్స్ టాస్క్ లో.. N1 దశకు చేరుకున్న వారి నుంచి 83 శాతం మంది మాత్రమే హిడెన్ షార్ట్ కట్ రూపొందించారు . మెలకువగా ఉన్నా లేదా N2 దశకు చేరుకున్న వారి సక్సెస్ రేట్లు వరుసగా 31 శాతం, 14 శాతం గా ఉన్నాయి. ఈ మేరకు నిద్రలోని  N1 స్టేజ్ సృజనాత్మకతను వెలికి తీస్తుందని ఒడియేట్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: