
అయితే.. ఇంకా తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నాసా చేస్తున్న ఓ ప్రయోగంతో అనంత విశ్వంలో అంతుచిక్కని ఇలాంటి అనేక ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం కలగబోతోంది. ఈ విశ్వంలోని గెలాక్సీలను క్షుణ్నంగా చూడగల జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగానికి నాసా రంగం సిద్ధం చేసింది. క్రిస్మస్ రోజు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగాన్ని చేయబోతోంది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచిఐరోపా అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్ 5 రాకెట్ ద్వారా ఈ టెలిస్కోపును అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.
మరి ఈ టెలిస్కోప్ ఏం చేస్తుంది.. ఏం కనిపెడుతుంది..? ఈ టెలిస్కోప్ టైమ్ మెషిన్ లాగా పనిచేస్తుందట. లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో శాస్త్రవేత్తలకు చెబుతుందట. బిగ్‌బ్యాంగ్ జరగ్గానే మొట్టమొదటిసారిగా ఏర్పడిన నక్షత్రాలను ఈ టెలిస్కోప్ పరిశీలిస్తుందట.
అంతే కాదు.. ఈ టెలిస్కోప్ ఇతర గ్రహాలపై జీవం అన్వేషణకు కూడా ఉపయోగపడుతుందట. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా , యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను డెవలప్ చేశాయి. ఇది చాలా చాలా ఖరీదైన ప్రయోగం.. అవును మరి.. ఈ వెబ్ టెలిస్కోప్ తయారీకి దాదాపు 75 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఈ టెలిస్కోప్‌తో కంటితో కనిపించే నక్షత్రాలను సాయంతో వెయ్యి కోట్ల రెట్ల స్పష్టతతో చూడవచ్చట. హబుల్ కంటే 100 రెట్ల స్పష్టతతో ఈ వెబ్ టెలిస్కోప్ చిత్రాలను అందిస్తుంది. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూపాయి నాణాన్ని సైతం స్పష్టంగా చూపించగలదంటే దీని శక్తి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిద్దాం..