
పెట్రో ధరల భారం అంతకంతకూ పెరిగిపోవడం, వెలికితీయగల పెట్రోల్ నిల్వలు అంతకంతకూ తరిగిపోతుండటంతో భవిష్యత్తులో ఈవీలదే రాజ్యమని భావిస్తున్న ఆటోమొబైల్ కంపెనీలకు టెస్లా విజయం స్ఫూర్తినిచ్చిందని చెప్పాలి. 2020తో పోలిస్తే 2021 లో ఎలక్ట్రానిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 160 పెరగడం చూస్తే ఈ ఏడాది ఆ కంపెనీలకు అదో మైలురాయనే భావించాలి. ఇక పెట్రో దిగుమతులకు అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాల్సిరావడంతో ప్రభుత్వాలు కూడా ఈవీల తయారీ కంపెనీలకు గణనీయమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో దేశీయ ఆటో మొబైల్ దిగ్గజాలన్నీ వీటి తయారీలో భాగం పంచుకునేందకు విదేశీ కంపెనీలతో ఒప్పందాలు, పరిశోధనల్లో మునిగిపోయాయి. అంటే భారత్‌లోనూ భవిష్యత్తులో విద్యుచ్ఛక్తితో నడిచే వాహనాలే రోడ్లమీద అధిక సంఖ్యలో కననబడపోతున్నాయన్నమాట. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌లోకి రాగా వాటికి ప్రజల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇక హైవేల వెంట పెట్రోల్ బంక్‌లకు పోటీగా వాహనాల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు కొన్ని కంపెనీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇది ఈ ఏడాది ఆశాజనకంగా కనిపిస్తున్న పర్యావరణ హితమైన మార్పు అని చెప్పాలి.