అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ అనగానే మనకు పెద్ద అనకొండలే గుర్తుకొస్తాయి. ఇది అత్యంత పెద్ద అడవి. ఇందులో ఎన్నో ఔషధ చెట్లు, అందమైన జీవులు ఉంటాయి. ఈ అడవిలో మనుషులూ నివసిస్తుంటారు. ఇటీవల కాలంలో ఇక్కడ నివసించే త్సిమానే/సిమనేస్ తెగ ప్రజలు ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే వీళ్లు అడవిలో బతుకుతున్నా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ తెగ ప్రజలు వేటాడడం, అడవి పండ్లు, కాయలు తినడం, వ్యవసాయం చేయడం ద్వారా జీవిస్తారు. ఈ తెగ ప్రజలను గురించి శాస్త్రవేత్తలు 20 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు.

మార్టినా కాంచి నేట్ అనే 84 ఏళ్ల త్సిమానే మహిళ యువకుల కంటే వేగంగా పనులు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఉదాహరణకు, యుక్కా చెట్లను వేరుతో సహా బయటకు లాగడం, అరటి చెట్లను నరకడం, భారీ బరువులను మోయడం వంటి పనులను చాలా తేలికగా చేస్తుంది. ఈ వయసులో ఇంత శక్తి ఉండడం ఈ తెగ ప్రజలకు సహజం. శాస్త్రవేత్తలు ఈ తెగ ప్రజల్లో ఎక్కడా చూడనంత ఆరోగ్యంగా రక్తనాళాలు ఉన్నాయని కనుగొన్నారు. అంతేకాకుండా, వీరి మెదళ్లు కూడా మనలాంటి వారి కంటే చాలా నెమ్మదిగా వృద్ధాప్యం చెందుతున్నాయి.

త్సిమానే ప్రజలు చాలా చురుగ్గా ఉంటారు. వారు డైలీ సగటున 16,000 నుంచి 17,000 అడుగులు నడుస్తారు. మనలాంటి నగరవాసులు రోజులో సగం సమయం కూర్చుంటే, వీరు పగటి సమయంలో 10 శాతం కంటే తక్కువ సేపు కూర్చుంటారు. వేటాడటం, పండ్లు కోయడం వంటి పనులు చేస్తూ రోజుకు ఎనిమిది గంటలకు పైగా శారీరక శ్రమ చేస్తారు. కొందరైతే రోజూ సుమారు 18 కిలోమీటర్లు నడుస్తారు. వీరి ఆహారంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వారు ఎక్కువగా వేయించిన ఆహారం, మద్యం, సిగరెట్లు వాడరు. వారి ఆహారంలో 72 శాతం కార్బోహైడ్రేట్లు, 14 శాతం కొవ్వు ఉంటాయి. ప్రోటీన్ అవసరాలను పక్షులు, కోతులు, చేపలు వంటి వేటాడిన జంతువుల నుంచి తీసుకుంటారు.

2017లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, త్సిమానేలకు ఇంతవరకు అధ్యయనం చేసిన వారిలోనే అత్యంత ఆరోగ్యమైన రక్తనాళాలు ఉన్నాయి. 75 సంవత్సరాలకు పైబడిన వారిలో 65 శాతం మందికి రక్తనాళాల్లో అడ్డంకులు లేవు. కానీ అదే వయసున్న అమెరికన్లలో 80 శాతం మందికి రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నాయి.

త్సిమానే ప్రజల మెదళ్లు కూడా ఇతర ప్రపంచంలో నివసించే ప్రజల కంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనలాగా వయసుతో పాటు  వారి మెదళ్లు కుచించుకుపోవు. అంతేకాకుండా, వారిలో ఒక్కరికీ అల్జీమర్స్ వ్యాధి లేదు. త్సిమానే ప్రజల వయసును కచ్చితంగా చెప్పడం కష్టం. వీరిలో కొంతమందికి లెక్కలు రావు కాబట్టి, తమ వయసును గుర్తుంచుకోవడానికి వేరే పద్ధతులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు, హిల్డా అనే మహిళ తన వయసు 81 అని చెబుతుంది కానీ, తను 100 సంవత్సరాలు అని నమ్ముతుంది. జువాన్ అనే 78 ఏళ్ల వ్యక్తి, మార్టినా అనే 84 ఏళ్ల మహిళ ఇప్పటికీ చాలా చురుగ్గా ఉంటారు. జువాన్ వేటాడడానికి వెళతాడు, మార్టినా అడవి మొక్కలతో గుడిసెలకు పైకప్పులు వేస్తుంది. అయితే, వీరు ఈ పనులు చేయడం కొంచెం కష్టంగా మారుతోందని అంటారు.

త్సిమానే ప్రజలలో చాలామంది కొన్ని రకాల ఇన్ఫెక్షన్ల వల్ల తక్కువ వయసులోనే మరణిస్తుంటారు. వాటిని తట్టుకున్న వారు మాత్రం జీవితాంతం ఆరోగ్యంగా చురుకుగా పనిచేస్తుంటారు. ఈ అధ్యయనం మొదలైనప్పుడు వారి సగటు ఆయువు కేవలం 45 ఏళ్లే. ఇప్పుడు అది 50 ఏళ్లకు పెరిగింది. ఇటువంటి కాలంలో వాళ్లు కూడా మోటర్ బోర్డ్ వంటి వాహనాలకు అలవాటు పడుతున్నారు. వాహనాల్లోనే చాలా దూరం ప్రయాణిస్తూ సిటీలకు చేరుకొని కావాల్సిన చక్కెర లాంటి సరుకులు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల కొలెస్ట్రాల్ పెరగడం డయాబెటిక్ వ్యాధులు రావడం జరుగుతోంది. అయితే వీరు ఇతరులు లాగా అభివృద్ధి చెందడమే వారి ఆరోగ్యానికి ముప్పులా పరిణమిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: