టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈసారి మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లు వంటి ఉన్నతస్థాయి పదవులపై గూగుల్ వేటు వేసింది. ఏకంగా 10% ఉద్యోగాలను తగ్గించనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం, ఇటీవల జరిగిన ఓ మీటింగ్‌లో పిచాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గూగుల్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా సంస్థాగత మార్పులు చేస్తున్న గూగుల్, ఈ తొలగింపులతో మరింత ఒత్తిడికి గురికానుంది. కొన్ని పోస్టులను నాన్-మేనేజిరియల్ రోల్స్‌లోకి మారుస్తుండగా, మరికొన్నింటిని పూర్తిగా రద్దు చేయనున్నారు.
ఇది కొత్తేమీ కాదు! 2022 సెప్టెంబర్‌లో గూగుల్ సామర్థ్యాన్ని 20% పెంచాలని పిచాయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత 2023 జనవరిలో ఏకంగా 12,000 మంది ఉద్యోగులను (మొత్తం ఉద్యోగుల్లో 6%) ఇంటికి పంపింది. ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని గూగుల్ అప్పట్లో పేర్కొంది. అంతేకాదు, 2024 జనవరిలోనూ పిచాయ్ ఉద్యోగులను హెచ్చరిస్తూ మరిన్ని తొలగింపులు ఉండొచ్చని సంకేతాలిచ్చారు.
ఈసారి కోతలు గతంలో ఉన్నంత స్థాయిలో లేకపోయినా, ప్రభావం మాత్రం తప్పదు. అంతేకాకుండా, గూగుల్ తన ఉద్యోగులలో "గూగుల్నెస్" అనే భావనను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. "గూగుల్నెస్" అంటే ఏమిటో పిచాయ్ తాజాగా కొత్త నిర్వచనం కూడా ఇచ్చారు. సంస్థ లక్ష్యాలపై దృష్టి పెట్టడం, బాధ్యతాయుతంగా వ్యవహరించడం, కొత్త ఆలోచనలను ప్రోత్సహించడమే నిజమైన "గూగుల్నెస్" అని ఆయన తేల్చి చెప్పారు.
గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో ముఖ్య కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెరుగుతున్న పోటీ. ఓపెన్ఏఐ వంటి సంస్థలు అత్యాధునిక AI సెర్చ్ ఇంజన్‌లతో గూగుల్‌కు గట్టి పోటీనిస్తున్నాయి. ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే సంస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని గూగుల్ భావిస్తోంది. అందుకే, ఖర్చులను తగ్గించుకోవడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై గూగుల్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఉద్యోగాల కోత అనివార్యమైంది.