ఇస్రో చేపట్టిన తొలి అంతరిక్ష వ్యవసాయ ప్రయత్నం ఇది. "క్రాప్స్" (కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్) అనే అత్యాధునిక ప్రాజెక్టులో భాగంగా ఈ ప్రయోగం జరిగింది. అతి తక్కువ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మొక్కలను పెంచడానికి, వాటికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) శాస్త్రవేత్తలు ఈ వినూత్న ప్రయోగానికి రూపకల్పన చేశారు.
ఈ పరీక్ష కోసం ఎనిమిది అలసంద విత్తనాలను ఇస్రో పీఓఈఎం-4 మాడ్యూల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నియంత్రిత వాతావరణంలో ఉంచారు. స్పేస్ లో మొక్కలు పెరగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, తేమ వంటి పరిస్థితులను పర్యవేక్షించే అత్యాధునిక వ్యవస్థలను ఇందులో అమర్చారు. ఈ ఎనిమిది విత్తనాలలో కనీసం మూడు మొలకెత్తడమే కాకుండా వాటికి ఆకులు కూడా వచ్చాయి. అంతరిక్షంలో మొక్కలను పెంచగల సామర్థ్యాన్ని ఇస్రో సాధించిందని చెప్పడానికి ఇదే నిదర్శనం. అంతేకాదు, భవిష్యత్తులో చేపట్టే సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకు ఇది ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తుంది అని ఇస్రో సంతోషంగా చెప్పుకొచ్చింది.
"సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో మానవ మనుగడకు ఇది ఒక గొప్ప ముందడుగు" అని ఇస్రో తన సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) లో పేర్కొంది. అయితే, పీఓఈఎం-4 మిషన్‌లో చేపట్టిన ఏకైక పరిశోధన ఇది మాత్రమే కాదు. అమిటీ యూనివర్సిటీ సైంటిస్టులు సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మొక్కల కణాలు ఎలా ప్రవర్తిస్తాయనే దానిపై పరిశోధనలు చేశారు. అలాగే, బెంగళూరులోని ఆర్ వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అంతరిక్షంలో పేగులోని బ్యాక్టీరియా పెరుగుదలను పరిశీలించింది.
ఈ ప్రయోగాలు జీవరాశులు అంతరిక్షంలో ఎలా జీవించగలవు, వృద్ధి చెందగలవు అనే అంశాలపై ఇస్రో చేస్తున్న విస్తృత పరిశోధనల్లో భాగం. అలసంద విత్తనాల విజయం, మానవులు భూమికి ఆవల నివాసాలు ఏర్పాటు చేసుకునే అవకాశాలను మరింత ముందుకు తీసుకెళ్లే కీలకమైన ముందడుగుగా చెప్పుకోవచ్చు.