భారతీయ రైల్వేల ప్రయాణం మనమందరం పుట్టడం కంటే ముందే స్టార్ట్ అయిపోయింది. సరిగ్గా చెప్పాలంటే 1830లో ఇండియన్ రైల్వే ప్రస్థానం మొదలయ్యింది. అప్పట్లో మద్రాస్‌లో రెడ్ హిల్స్ నుంచి చింతద్రిపేట వరకు గ్రానైట్‌ను తరలించడానికి ఒక చిన్న రైలు మార్గాన్ని నిర్మించారు. ఇది కేవలం ఒక చిన్న ప్రారంభం మాత్రమే, కానీ భారతదేశంలో రవాణా విప్లవానికి నాంది పలికింది. ఆ తరువాత, 1853 ఏప్రిల్ 16న, బొంబాయి నుంచి థానే వరకు మొదటి ప్యాసింజర్ రైలు 34 కి.మీ ప్రయాణించి 400 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఇది భారతదేశంలో ప్యాసింజర్ రైలు సర్వీసులకు అధికారిక ప్రారంభం.

ఆ తరువాత రైలు మార్గాలు దేశంలోని ప్రధాన నగరాలకు విస్తరించాయి. ప్రయాణికులను, సరుకులను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో రైల్వేలు ఆధునీకరణ వైపు అడుగులు వేశాయి. 1925 ఫిబ్రవరి 3న బొంబాయి విక్టోరియా టెర్మినస్ నుంచి కుర్లా హార్బర్ వరకు మొదటి ఎలక్ట్రిక్ రైలు పరుగులు పెట్టింది.

స్వాతంత్ర్యం వచ్చాక, 1951లో ఇండియన్ రైల్వేస్‌ను నేషనలైజ్ చేశారు. దీని ద్వారా దేశంలోని వివిధ ప్రాంతీయ రైల్వే నెట్‌వర్క్స్‌ను ఒకే వ్యవస్థలోకి తీసుకువచ్చారు. ఆవిరితో నడిచే ఇంజిన్లకు స్వస్తి చెప్పి డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్లను వాడటం మొదలెట్టారు. దీనితో ప్రయాణ సమయం తగ్గింది, సామర్థ్యం పెరిగింది.

రీసెంట్ ఇయర్స్‌లో మన రైల్వేలు ప్రపంచంతో పోటీ పడటానికి అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. 2019లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా సెమీ-హై-స్పీడ్ రైలు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ రైళ్లు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని, వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఇక మున్ముందు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ 2026 నాటికి పూర్తి కానుంది. ఇది రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఈ అద్భుతమైన ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సహాయంతో రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1830 నాటి నాలుగు సీట్ల ఆవిరి ఇంజిన్ రైలు నుంచి నేటి బుల్లెట్ రైలు వరకు రైల్వేలు సాధించిన టెక్నాలజీ ప్రోగ్రెస్ ని ఈ వీడియో అద్భుతంగా చూపిస్తుంది. దాదాపు రెండు శతాబ్దాలలో భారతీయ రైల్వేలు చేసిన అభివృద్ధిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: