
ఈ దూకుడుకు కారణం ఏంటంటే.. 5g టెక్నాలజీనే అంటున్నారు మార్కెట్ నిపుణులు. 5g టాబ్లెట్ల షిప్‌మెంట్లు ఏకంగా 424% పెరగడం మామూలు విషయం కాదు. దీంతోపాటు.. ప్రీమియం టాబ్లెట్ల మోజు కూడా పెరిగిందట. పాకెట్‌లో డబ్బులుంటే.. మంచి ఫీచర్లున్న టాబ్లెట్ కొనేందుకు జనాలు వెనకాడట్లేదు.
బ్రాండ్ల విషయానికొస్తే.. ఈసారి మార్కెట్‌లో యాపిల్, శామ్‌సంగ్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. యాపిల్ 29% మార్కెట్ షేర్‌తో టాప్‌లో ఉన్నా.. శామ్‌సంగ్ మాత్రం 28%తో ఊపిరి సలపనివ్వకుండా వెంటాడుతోంది. గత ఏడాదితో పోలిస్తే, యాపిల్ కొంచెం పెరిగినా.. శామ్‌సంగ్ మాత్రం దూకుడు పెంచింది. పైగా యాపిల్ ఈ ఏడాది ఏకంగా కోటి ఐప్యాడ్‌లను అమ్మేసి రికార్డు సృష్టించింది.
అయితే, 2024 చివరి మూడు నెలల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. శామ్‌సంగ్ 29% మార్కెట్ షేర్‌తో టాప్ ప్లేస్‌కు వచ్చేసింది. యాపిల్ 21%తో మూడో స్థానానికి పడిపోగా.. లెనోవా 23%తో రెండో స్థానంలో నిలిచింది. మొత్తానికి క్వార్టర్లీ లెక్కల్లో శామ్‌సంగ్ పైచేయి సాధించింది.
మిగతా బ్రాండ్ల విషయానికొస్తే.. లెనోవా 16% మార్కెట్ షేర్‌తో మూడో స్థానంలో ఉన్నా.. గత ఏడాదితో పోలిస్తే కాస్త వెనకబడింది. కానీ.. షియోమి మాత్రం గతంలో 8% ఉన్న మార్కెట్ షేర్‌ను ఏకంగా 13%కి పెంచుకుని దూసుకుపోతోంది. రియల్‌మీకి మాత్రం ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. 9% నుంచి 6%కి పడిపోయింది. అంటే.. రియల్‌మీ టాబ్లెట్లను జనాలు అంతగా పట్టించుకోవడం లేదన్నమాట!
మార్కెట్ నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఇప్పుడు ట్రెండ్ అంతా ప్రీమియం టాబ్లెట్ల వైపే ఉంది. 20 వేల రూపాయలు పైబడిన టాబ్లెట్ల అమ్మకాలు ఏకంగా 128% పెరిగాయంటే నమ్మశక్యం కాదు. హైబ్రిడ్ వర్క్ కల్చర్, ఆన్‌లైన్ క్లాసులు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం జనాలు ప్రీమియం ఫీచర్లున్న టాబ్లెట్లపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. డబ్బులుంటే.. బెస్ట్ టెక్నాలజీ కావాలనుకుంటున్నారు.
యాపిల్ ఐప్యాడ్ 10 సిరీస్‌లు, శామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ A9 ప్లస్ 5g మోడల్స్, లెనోవా ట్యాబ్ M11 సిరీస్, షియోమి ప్యాడ్ 6.. ఇవన్నీ ప్రీమియం సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న మోడల్స్. ముఖ్యంగా షియోమి ప్యాడ్ 6 అయితే.. ప్రీమియం టాబ్లెట్ సేల్స్‌లో మూడో వంతు వాటా కొట్టేసింది. మార్కెట్ నిపుణులు అంచనా ప్రకారం.. టాబ్లెట్ మార్కెట్ జోరు ముందు ముందు కూడా కొనసాగేలా ఉంది. 2025లో కూడా 10-15% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నారు.