ప్రముఖ సీనియర్, లెజండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో అత్యద్భుతమైన నటన కనబరిచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు కైకాల. గంభీరమైన వాచకంతో, నవరసభరితమైన నటనతో, అబ్బురపరచే ఆంగికంతో, హావభావాలను చిలికిస్తూ నటనకే భాష్యం చెప్పిన కైకాల "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు కూడా పొందారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఈయన వేయని పాత్ర లేదని నే చెప్పాలి.
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, అన్నగా, బాధ్యత గల తండ్రిగా.. ఇలా చెప్పుకుంటూపోతే సత్యనారాయణ గారు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. అయితే సినిమాల్లో ఆయన పోషించిన ప్రతి పాత్రా విలక్షణమైందే. అవి ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచేవే. ఇక దాదాపు 777కి పైగా చిత్రాల్లో నటించిన సత్యనారాయణ కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో 1935జులై 25న కైకాల లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడ లలో పూర్తిచేశాడు. గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.
అయితే నటనపై ఆసక్తి ఉండడంతో కైకాల మద్రాసు వెళ్ళారు. అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరిగిన ఈయన్ను మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ నిర్మించిన `సిపాయి కూతురు` అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గురించటానికి ప్రధాన కారణం.. కైకాల రూపు రేఖలు ఎన్టీఆర్ పోలి ఉండటమే. ఈ క్రమంలోనే కొన్నాళ్లు ఎన్టీఆర్‌కు డూపుగా పలు సినిమాల్లో నటించారు కైకాల.
అయితే సత్యనారాయణను ఒక విలన్‌గా చిత్రించవచ్చు అని కనిపెట్టినది మాత్రం బి.విఠలాచార్య. ఈయన సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజా మహిమలో వేయించాడు. ఈ పాత్ర సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. ఎందుకంటే.. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమడటంతో పాటు.. తర్వాతి సినిమాల్లోనూ ప్రతినాయకుడుగా స్థిరపడేలా చేసింది. ఇక ఆ తర్వాత సత్యనారాయణ యమగోల మరియు యమలీల చిత్రాల్లో యముడిగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా నటించేవారు. ఇక ఒకానొక దశలో హీరోగా అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ తో సమానంగా కూడా పారితోషికం తీసుకునేవారు కైకాల సత్యనారాయణ. అలాగే సత్యనారాయణ నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించారు. రమా ఫిలిమ్స్ పేరిట చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి.. గజదొంగ, ఇద్దరు దొంగలు, కొదమ సింహం, బంగారు కటుంబం, ముద్దుల మొగుడు, వంటి ఎనిమిది ప్రయోజనకరమైన చిత్రాలు తీసి విజయం సాధించారు. కొన్ని చిరంజీవి సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించి విజయాలు అందుకున్నారు. ఇక ఎన్ని అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురైనా అలుపెరుగని కృషి, పాటుదలనే ఆయన్ను నేడు విజేతగా నిలిపింది.