రేవంత్ రెడ్డి...రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. తాను నిజమని నమ్మిన విషయాన్ని రుజువు చేయడానికి ఏ స్థాయికైనా వెళ్ళేందుకు వెనుకాడరు. ఎంతటి వారితోనైనా పోరాడగల సామర్థ్యం రేవంత్‌ది. అంతులేని ఆత్మవిశ్వాసం, మొక్కవోని పోరాట పటిమ చూపడంలో రేవంత్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. రేవంత్‌లోనే ఈ తత్వమే అతి తక్కువ రాజకీయ కాలంలోనే ఎన్నో వివాదాలను, కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది.

 

ఇక కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ జీవితం మొదలు పెట్టిన రేవంత్... కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకునే వరకు ఎదిగారు. విద్యార్ధి దశలోనే రేవంత్ రాజకీయాలవైపు ఆకర్షితులయ్యారు. కాలేజీ రోజుల్లోనే ఏ‌బి‌వి‌పి నాయకుడుగా పనిచేశారు. తర్వాత ఆర్ట్స్‌లో పట్టభద్రుడై, తన మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన దగ్గర నుంచి రేవంత్ అసలు రాజకీయ జీవితం మొదలైంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డితో బంధుత్వం ఉన్నా దానిని ఏనాడు వాడుకోలేదు. ఓ సామాన్య కార్యకర్తగానే టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ జీవితం మొదలు పెట్టారు.

 

కానీ తర్వాత టీఆర్ఎస్ సపోర్ట్ లేకుండానే కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్‌ జెడ్‌పిటిసీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత మహాబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్ధతుతో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలోకి విజయం సాధించారు. ఆ వెంటనే టీడీపీలో చేరి, 2009 ఎన్నికల్లో కొడంగల్ నుండి బరిలో దిగి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదేళ్లు చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారు.

 

ఇక రాష్ట్ర విభజన జరిగాక అంటే 2014 ఎన్నికల్లో మరోసారి టీడీపీ తరుపున కొండంగల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్‌కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బులు ఇస్తూ పట్టుబడి, జైలుకు వెళ్లారు. జైలు నుంచి తిరిగొచ్చాక కేసీఆర్‌పై పోరాటం తీవ్రం చేశారు. కానీ అప్పటికే తెలంగాణలో టీడీపీని కేసీఆర్ వీక్ చేసేశారు. దీంతో టీడీపీలో ఉంటే రాజకీయ జీవితం కష్టమని భావించి, ఇష్టం లేకపోయినా సరే టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.

 

కాంగ్రెస్‌లో చేరాక 2018 ఎన్నికల్లో మరోసారి కొండంగల్ నుంచి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అదే సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పదవి కూడా దక్కించుకుని దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏదొరకంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నారు. ప్రతి అంశంలోనూ కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

 

ఈ విధంగా దూకుడుగా ప్రదర్శిస్తున్న రేవంత్...పీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకుని తన సత్తా ఏంటో చూపించాలని చూస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, సీఎం పీఠంలో ఎలాగైనా కూర్చోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కాబోయే ముఖ్యమంత్రి అనిపించుకుంటున్న రేవంత్‌ని కాంగ్రెస్‌లోనే సీనియర్ నేతలే వెనక్కి లాగుతున్నారు. ఇప్పటికే పీసీసీ దక్కనివ్వకుండా లాబీయింగ్‌లు చేస్తున్న కాంగ్రెస్ పెద్ద తలకాయలు, రేవంత్‌ని సీఎం పీఠంలో కూర్చోనిస్తారా? అనేది కాస్త డౌటే. కానీ మొక్కవోని పోరాట పటిమ కనబరుస్తూ కార్యకర్త స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన రేవంత్‌కు సీఎం పీఠం దక్కించుకుని విజేతగా నిలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: