భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. మనం దేశంలో అన్ని ప్రాంతాల్లో ఒకే పండగను జరుపుకున్నా..ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆచారాలుంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వింత వింత ఆచారాలు దర్శనమిస్తుంటాయి. తాజాగా హోళీ పండగను వింతగా జరుపుకునే వీడియో బయటకు వచ్చింది. అక్కడ హోళీ వచ్చిందంటే మగవాళ్లు ఆడవాళ్లుగా మారిపోతుంటారు. కట్టు బొట్టు మాట అన్నీ ఆడవాళ్లలాగానే మారిపోతాయి. ఇంతకీ ఈ వింత ఆచారం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం...ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు
జిల్లా అదోని ప్రజలు ఈ వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి సాంప్రదాయం ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లలాగా మారి హోళీ పండగను జరుపుకుంటారు. చీరకట్టుకుని బొట్టు పెట్టుకుని అచ్చం ఆడవాళ్లలా మారిపోతుంటారు. అంతే కాకుండా నోటికి వచ్చిన తిట్లతో తిడుతుంటారు. చీర కట్టుకున్న తరువాత బోనం నెత్తిన పెట్టుకుని ఆలయానికి బయలు దేరుతారు..మధ్యలో ఎవరైనా తెలిసిన వాళ్లు కనిపిస్తే వారిని దూషిస్తూ వెళతారు.
కనిపించిన వ్యక్తులు గతంలో ఏవైనా చెడు పనులు చేస్తే వాటిని గుర్తు చేస్తూ మరీ తిట్లపురాణం మొదలు పెడతారు. అయితే పండగపూట వారు తిట్టే తిట్లకు ఎవరూ కోప్పడరు..వారి తిట్లను ఆశీర్వాదంగా భావిస్తూ ఇంకా కొద్దిసేపు తిడితే భాగుంటుందని అనుకుంటారు. ఇక బయటకు వారికి ఇది పిచ్చిలా అనిపించవచ్చు గానీ స్థానికులకు మాత్రం అది గత వందసంవత్సరాలుగా వస్తోన్న ఆచారం. ఫాల్గుణ మాసం శుద్ద దశమి సందర్భంగా నిర్వహించే ఈ వేడుకలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు కొనసాగుతాయి. అంతకు ముందు రెండు రోజుల క్రితం ఉత్సవ నిర్వాహకులు ఇంటింటికీ వెళ్లి రంగులు చల్లి వేడుక జరుపుకుంటారు.ఇక
ఆది సోమవారాల్లో గ్రామం నడిఒడ్డున రతి , మన్మథుల విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు. మరోవైపు ఊరేంగింపు ఉత్సవాల్లొ దవడలకు దబ్బనాలు గుచ్చుకుంటారు. ఇక ఈ ఆచారాలు పాటించడం వల్ల కుటుంబాల్లో మంచి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు.