హైదరాబాద్: ఇటీవల కరోనా బారిన పడి, తిరిగి మృత్యుంజయులుగా బయటపడ్డ ఒక సాఫ్ట్వేర్ దంపతుల కథ .. అయితే ఈ కరోనాను వారు ఎలా జయించారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
నా పేరు నూనె శ్రీనివాస్. వయసు (36), సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తుడిని . కుత్బుల్లాపూర్ లో నివాసం ఉంటున్నాను. ఇటీవల నా భార్య రాజ్యలక్ష్మి (35) కీ, నాకు కరోనా సోకింది. దీంతో మొదట తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాం. వైరస్ ఉద్రిక్తత తీవ్రంగా ఉండడంతో వైద్యులు నాకు నయం అవుతుందో,లేదో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. భగవంతుడి దయ, స్నేహితుల సహకారంతో మనోధైర్యాన్ని కూడపెట్టుకొని కరోనాపై పోరాడి గెలిచాను.
ఇక నా భార్యకు ఏప్రిల్ 14 వ తేదీన తీవ్ర జ్వరం (102) వచ్చింది. సాధారణ జ్వరం అనుకొని టాబ్లెట్ వేసుకుంది.
ఇక మరుసటి రోజు కూడా జ్వరం తగ్గుతూ,పెరుగుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత రోజు నుంచి దగ్గు ప్రభావం మొదలైంది. దీంతో మాత్రలను క్రమం తప్పకుండా వాడింది. ఇక ఆ తర్వాత రెండో రోజు నాకు కూడా జ్వరం వచ్చింది. నేను కూడా మాత్రలు వేసుకున్నాను. ఏప్రిల్ 16 న పరిస్థితి అలాగే కొనసాగుతూ, ఆహారం కూడా తినబుద్ధి కాలేదు. దీంతో కరోనా సోకిందనే అనుమానంతో పరీక్షలు చేయించుకుంటే ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. మా కూతురికి పరీక్ష చేయిస్తే నెగిటివ్ వచ్చింది. లక్షణాలు ఉండటం వల్ల వైద్యలు సూచించిన మేరకు మందులు వేసుకున్నాము.
ఇక ఏప్రిల్ 17 న నా భార్యకు అధికంగా వాంతులు అయ్యాయి. ఇద్దరం కూడా రోజులో 15 గంటలు నిద్రకే పరిమితం అయ్యాం. ఆహారం తినాలనిపించేది కాదు. ఓపిక నశించి పోయింది. అంతా అయోమయంగా మారింది. ఆ తర్వాత ఏప్రిల్ 18 న వాసన, రుచిని కోల్పోయాము. మంచినీళ్లు కూడా రుచి తెలియలేదు. నేను కేవలం రెండు అడుగులు వేస్తే దానికి సరిపడా ఊపిరి తీసుకోవడానికి సుమారు 5 నిమిషాల సమయం పట్టేది. 10 మీటర్ల దూరం నడిచేందుకు కనీసం అరగంట సేపు సమయం తీసుకోవాల్సి వచ్చింది. నా భార్యకు పూర్తిగా కళ్ళు ఎరుపు రంగు లోకి వచ్చాయి. ఏప్రిల్ 22 వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పాను. వారు వెంటనే వచ్చే అదే రోజు షాపూర్ నగర్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి మమ్మల్ని తీసుకెళ్లారు.
ఇక ఏప్రిల్ 23 న ఆసుపత్రిలో చేరాము. అప్పటికే మా ఇద్దరి శాచ్యురేషన్ లెవల్ ( రక్తంలో ఆక్సిజన్ స్థాయి )80 నుంచి 85 శాతం మధ్యలో ఉంది. హాస్పిటల్ బయట నుంచి లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. భయం వల్ల తీవ్ర ఉక్కపోతతో చెమటలు కారుతూనే ఉన్నాయి. ఇలా ఆరు రోజుల వరకు ఆస్పత్రిలో కృత్రిమ ఆక్సిజన్ తో ఇద్దరం కూడా చికిత్స పొందాము. ఊపిరితిత్తుల్లో ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఇద్దరికీ చెరో 6 డోసులు రెమ్డెసివర్ ఇంజెక్షన్లను ఇచ్చారు. చికిత్స సమయంలో బెడ్ పై పక్కకు తిరిగి పనుకున్నా ఊపిరి ఆడేది కాదు. చికిత్సతో పాటు వైద్యులు, స్నేహితులు చేసిన సూచనల మేరకు మనోధైర్యాన్ని కూడపెట్టుకుని భయాన్ని పోగొట్టుకోవడం తో కేవలం ఆరు రోజుల్లోనే ఆస్పత్రి నుంచి బయటపడ్డ గలిగాము. ఇక ఏప్రిల్ 28 న డిశ్చార్జ్ అయ్యాము..