కానీ ఇప్పుడు మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ప్రత్యేకమైన పక్షి. దీని పేరు హిమాలయ గ్రిఫన్ రాబందు. ఈ హిమాలయ రాబందు మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో ఓ పచ్చని చెల్కలాంటి ప్రదేశంలో కనిపించింది. ఇది చాలా పెద్దగా ఉంటుంది. సాధారణంగా హిమాలయ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ టైగర్ ఫారెస్ట్ లో కనిపించటం మాత్రం చాలా ప్రత్యేకమైన విషయమని అధికారులు చెబుతున్నారు.
ఈ రాబంధును ఫారెస్ట్ కన్జర్వేటర్, పక్షుల అధ్యయన నిపుణుడు రోహన్ భటే తన కెమెరాలో క్లిక్ మనిపించారు. సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో పర్వత శ్రేణుల మధ్యలో ఎగురుతున్న హిమాలయ రాబందును చూసి ఆయన దాని వెంట పడ్డారు. చివరికి దాన్ని ఫొటోతీసి ఆనందపడిపోయారు. ఈ గ్రిఫన్ రాబందు 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంటుంది. అంతేకాదు వేల కిలోమీటర్ల దూరం ఆగకుండా ప్రయాణిస్తుంది.
ఆకాశంలో అత్యంత ఎత్తున ఎగురుతూ కూడా తన ఆహారాన్ని కనిపెట్టడం దీని ప్రత్యేకత. టిబెట్, కాబూల్, భూటాన్, తుర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి హిమాలయ ప్రాంతాల్లోనే ఎక్కువగా సంచరిస్తూ ఉంటుంది. ఈ పక్షి125 సెంటీమీటర్ల ఎత్తు, 8 నుంచి 9 అడుగుల పొడవైన రెక్కలతో భయంకరంగా ఉంటుంది. సుమారు 8 నుంచి 10 కిలోల బరువు ఉంటుంది. పైగా ఈ పక్షిలో ఆడ, మగ రెండు ఒకే రకంగా ఉంటాయి. వీటిలో ఏది మగదో, ఏది ఆడదో గుర్తు పట్టం చాలా కష్టం. అయితే ఈ పక్షి మొదటి సారి దక్షిణ భారతదేశానికి వచ్చింది.