సోమవారం రాత్రి నిలిచిపోయిన సేవలు మంగళవారం ఉదయం 4 గంటల సమయం నుంచి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ పని చేస్తున్నాయి. ఫేస్‌బుక్ మాత్రం ఉదయం 7 గంటల తరువాత తన సేవలను ప్రారంభించింది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయి తిరిగి ప్రారంభం కావడంతో నెటిజన్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో యూజర్లు సందేశాలతో సతమతమవుతున్నారు. చాటింగ్, షేరింగ్స్, లైక్స్, కామెంట్లు ఇలా ఎవరికి వారు సేవలను ప్రారంభించారు. ఈ సేవలు కొద్దిగా సమయం పని చేయకపోవడంతోనే ప్రపంచం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. నెటిజన్లలో ఏదో కోల్పోయామని ఫీలింగ్ నెలకొన్నది.
సోషల్ మీడియా నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగము అయిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా సేవలకు అంతరాయం కలుగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది. నా ఫోన్ ప్రాబ్లమా..? లేక నెట్ ప్రాబ్లమా..? ఏ సమస్యతో ఈ విధంగా వస్తుందని అయోమయంతో పడ్డారు. గతంలో ఇలాంటి సమస్య చాలా సార్లు తలెత్తింది. 10 నుంచి 15 నిమిషాల లోపు మాత్రమే సమస్య పరిష్కారం అయింది. కానీ ఇప్పుడు ఎక్కువ సమయంలో పట్టడంతో కోట్లాది మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కున్నారు. భారతదేశంలో ఫేస్‌బుక్‌కు సంబంధించి దాదాపు 410 మిలియన్ లకు పైగా వినియోగిస్తున్నారు. అదేవిధంగా వాట్సాప్ మెసేంజర్‌కు సైతం 530 మిలియన్, ఇన్‌స్టాగ్రామ్‌కు 210 మిలియన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఈ సమస్య ఈ విధంగా తలెత్తడంతో చాలా మంది యూజర్లు తమకు సంబంధించిన యాప్స్ ను డెలీట్ చేసి కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఈ విషయాలను కొంతమంది ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మొత్తానికి సోషల్ మీడియా వ్యవహారం ప్రపంచం మొత్తం చర్చనీయాంశంగా మారింది.