పులులు భయంకరమైన, క్రూరమైన జంతువులు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కానీ థాయ్‌లాండ్, దుబాయ్ దేశాలలో పులులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. నిజానికి పులులను పెంపుడు జంతువులుగా పెంచడం చట్టవిరుద్ధం. ఆ వన్యప్రాణులు అడవిలోనే ఉండాలి. ఒకవేళ వాటిని పెంచుకున్నా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదంటే ఆ కౄర మృగాళ్ల దాడిలో ప్రాణాలు కోల్పోక తప్పదు. ఇప్పటికే చాలామంది యజమానులు వీటి చేతుల్లో అత్యంత దారుణమైన పరిస్థితులలో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒక మహిళ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఒక పెద్ద పులితో నిర్లక్ష్యంగా వ్యవహరించి చివరికి చిక్కుల్లో పడింది. దానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఆ వైరల్ వీడియో ప్రకారం, ఒక మహిళ ఒక పెద్ద పులిని ప్రేమగా నిమురుతూ దానితో కలిసి కాసేపు సమయం గడపాలి అనుకుంది. కొద్ది సెకండ్ల పాటు ఆమె పులి చర్మం తాకుతూ ఉంది. అయితే ఈ మృగం ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలీదు కాబట్టి అది ఒక్కసారిగా అగ్రెసివ్‌గా మారింది. అది సదరు మహిళ చేతిని, కాలును నోటితో పట్టుకుంటూ దాడి చేయబోతున్నట్లు ప్రవర్తించింది. అది ఆ మహిళను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాళ్లు, చేతులు నోటితో పట్టుకుంటూ, పంజాతో దగ్గరికి లాక్కుంటూ ఆమెకు ముచ్చెమటలు పట్టించింది. కంగారు పడితే సదరు పులి విరుచుకుపడి క్షణాల్లో చంపేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆమె చాలా సహనంగా వ్యవహరించింది.

ఆ పులిని ఏమార్చి తనని కాపాడాలంటూ సైగలు కూడా చేసింది. అయితే వైరల్ వీడియో చివరి వరకు ఆమె దాని నుంచి తప్పించుకున్నట్లు కనిపించలేదు. మొత్తం మీద ఈ పరిస్థితి నుంచి ఆమె బయటపడే ఉండొచ్చు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం పులుల దగ్గరకు వెళ్లడం ఎందుకు? ఇలాంటి ప్రమాదకర సిచువేషన్ లో పడటం ఎందుకు? చాలామంది ప్రజలు ఇలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తూ ప్రాణాలను కోల్పోతున్నారని కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: