ఉపవాసం అనేది ప్రతి మతంలో వుండే ఆచారం. ఈ ఉపవాసం పేరుతో కేవలం దైవాన్ని ఆరాధించడమే కాదు.. దాని అంతర్లీన పరమార్థం ఆరోగ్యమనే చెప్పాలి.అందుకే చాలామంది కూడా ఉపవాసం చేయడానికి ఇష్టపడుతుంటారు.తాజాగా జైన మతానికి చెందిన ఓ బాలిక ఏకంగా 110 రోజుల పాటు కఠిన ఉపవాసం చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచి తన వైపు తిప్పుకుంది.అసలు అన్ని రోజుల పాటు ఏమీ తినకుండా ఆమె ఉపవాసం ఎలా చేయగలిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


జైనమతంలో ఈ ఉపవాస దీక్షను చాలా నిష్టగా చేస్తారు. ఈ క్రమంలో ముంబైలోని జైన కుటుంబానికి చెందిన క్రిష అనే 16 ఏళ్ల అమ్మాయి ఏకంగా 3 నెలల 20 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎంతో కఠిన ఉపవాసం చేసింది.చరిత్ర చూసుకుంటే మహా మహారుషులు ఇలాంటి తపస్సులు చేయడం చూశాం. కానీ ఇంత చిన్న వయసులో మూడ్నెళ్ల పాటు ఉపవాస దీక్షను చేపట్టడం నిజంగా ఆశ్చర్యమే. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు ముంబై ఘనంగా వేడుకలని నిర్వహించడంతో ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ హాట్‌టాపిక్‌గా మారింది.


ఇంతకీ ఆ బాలిక అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగింది అన్న వివరాలలోకి వెళితే..తొమ్మిదేళ్ల చిన్న వయసు నుంచే క్రిషకు ఉపవాసం చేయడం అలవాటుగా ఉండేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. మొదట 26 రోజుల ఉపవాసం తర్వాత ఆమె 31 రోజుల పాటు ఉపవాసాన్ని పొడిగించింది. ఆ తర్వాత 51 రోజుల పాటు నిరాహార దీక్షను ఆమె విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తరువాత మరికొన్ని రోజులు పొడిగించుకుంటూ ఏకంగా 110 రోజుల పాటు కఠినమైన ఉపవాసాన్ని పూర్తిచేసింది.


ఈ క్రమంలో సుమారు 18 కేజీల బరువు తగ్గినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆమెకు ఎదురు కాకపోవడం విశేషం.ఇన్ని రోజుల పాటు క్రిష ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో పాటు మొదటి 40 రోజులు యథావిధిగా కాలేజీకి కూడా వెళ్లిందట. ఆమె అన్ని రోజుల పాటు ఉపవాసం ఎలా చేయగలిగిందంటే.. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల మధ్య మాత్రమే గోరువెచ్చని నీళ్లను  తాగేది. ఇలా ఆహారం తీసుకోకుండా కేవలం నీళ్లను మాత్రమే తాగుతూ చేసే ఉపవాసాన్ని వాటర్‌ ఫాస్టింగ్‌ అని అంటారు. కేవలం నీళ్లను మాత్రమే తీసుకునేటప్పుడు కాస్త గోరువెచ్చని నీటిని తీసుకోవడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: