బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొందరు చేసిన న్యూసెన్స్ అంతా ఇంతా కాదు. అభిమానం పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు.. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను పోలీసుల సహకారంతో వేరే మార్గం నుంచి బయటికి పంపించింది. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌పై చేరుకోవడంతో రచ్చ స్టార్ట్ అయ్యింది. బస్సులపై రాళ్లు రువ్వడం, మిగతా కంటెస్టెంట్‌ల కార్లపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. అమర్‌దీప్, అశ్విని, బిగ్ బాస్ బజ్ హెస్ట్ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఐతే.. విన్నర్‌గా గెలిచినందునే తాను అందరినీ కలిసి వెళ్లాలి అనుకున్నానంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.
పోలీసులు ఈ ఘటనపై సుమోటోగా ఈ కేసు పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ కారు నడిపిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం రెండు కేసులు పెట్టగా ఒక దాంట్లో పల్లవి ప్రశాంత్ పేరు కూడా చేర్చారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు నాన్ బెయిలబుల్ కావడంతో ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.