చాలా మందికి కుప్పం పేరు వింటే చంద్రబాబు పేరే గుర్తుకు వస్తుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంగా ఉన్న కుప్పంలో అనేక దందాలు సాగుతుంటాయి. ఇదొక స్మగ్లింగ్ సెంటర్‌గా కూడా మారిందని చెప్పడానికి ఇప్పుడు జరిగిన సంఘటనే నిదర్శనం. ఏపీ, తమిళనాడు, కర్ణాటక..ఈ మూడు రాష్ట్రాలకు సరిహద్దుగా కుప్పం ప్రాంతం ఉంది. దీంతో తమిళనాడు నుంచి కుప్పం మీదుగా స్మగ్లింగ్ సాగుతోంది. కర్ణాటక మీదుగా ఉన్న ఈ రూట్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ఓ లేఖను కూడా రాశారు. అయినా కూడా ఎక్కడా స్మగ్లింగ్ ఆగలేదు. తాజాగా కుప్పం, పలమనేరు జాతీయ రహదారిలో పోలీసులు పెద్ద మొత్తంలో తమిళనాడు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ కంటైనర్‌ను సీజ్ చేశారు.

కుప్పం బైపాస్ రోడ్‎లోని భారత్ పెట్రోల్ బంక్ దగ్గరలో కంటైనర్ వాహనం పంచర్ అయ్యింది. ఆ కంటైనర్‌ను చెక్ చేయగా అందులో తమిళనాడు ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యం పెద్ద మొత్తంలో పట్టుబడింది. పోలీసులు కంటైనర్ నుంచి 10 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేశారు. కంటైనర్ వద్దకు పోలీసులు చేరుకోగానే లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ పరార్ అయ్యారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నుంచి కర్ణాటకలోని కోలార్ జిల్లాకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తీసుకెళ్తూ ఉంటారు.

చిత్తూరు జిల్లా మీదుగానే ఈ స్మగ్లింగ్ సాగుతూ ఉంటుంది. రైస్ హబ్‎గా ఉన్న బంగారు పేటకు మూడు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మార్గాలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు. అయినప్పటికీ స్మగ్లింగ్ దందా ఆగడం లేదు. కిలో రేషన్ బియ్యం రూ.2ల కమిషన్‌తో ఈ వ్యవహారం సాగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే రైస్ స్మగ్లింగ్ ముఠాకు రాజకీయ నేతల అండదండలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: