కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వసతి గృహం బాత్‌రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టారని విద్యార్థినులు గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేపట్టారు. కెమెరాలతో చిత్రీకరించిన దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, అతని సహచరులు, మరో విద్యార్థిని ఉన్నారని ఆరోపించారు.దీంతో జూనియర్‌, సీనియర్‌ విద్యార్థుల మధ్య వాగ్వాదాలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల హాస్టల్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. రహస్య కెమెరాలు ఉన్నాయని సామాజిక మాధ్యమాల్లో కొన్ని రోజుల క్రితమే ప్రచారం జరిగినా బాధ్యులపై యాజమాన్యం చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. సీఎం ఆదేశాలతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక పరిశీలన మేరకు బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని, నిందితుల ల్యాప్‌ట్యాప్‌లు, మొబైల్‌ ఫోన్లు పరిశీలించినా, నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు లేవని ఎస్పీ గంగాధర్‌ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా నేరం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు గుడివాడ సీసీఎస్ సీఐ రమణమ్మ నేతృత్వంలో ఓ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌, ఎస్పీ తెలిపారు. ఆధారాలు, సమాచారాన్ని అందజేసి దర్యాప్తునకు సహకరించాలని విద్యార్థినులను కోరారు.

సోమవారం వరకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం మళ్లీ తనిఖీలు చేస్తామని తెలిపింది. విద్యార్థినులపై కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని, యాజమాన్యానికి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎవరైనా వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని విద్యార్థినులకు సూచించారు. మరోవైపు ఘటనతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు విద్యార్థినులను హాస్టల్‌ నుంచి ఇళ్లకు తీసుకెళ్లారు.గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఘటన పై విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారి పై ఓ మహిళ పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారి తీసింది.'విచారణ జరుగుతోంది. మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు. ఎస్పీ అధికారి చెబుతున్నా మీకెందుకు అర్థం కావట్లేదు' అని పోలీస్ మండిపడ్డారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరుగుతుందని ఎస్పీ అధికారి చెప్పిన మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు.మేము ఇక్కడ మీ కోసమే తిండి తిప్పలు లేకుండా వర్షంలో తడుస్తున్నామని ఆమె చెప్పారు. ఈక్రమంలో అక్కడ ఉన్న అమ్మాయిలు స్పందిస్తూ.. మీకు బాధ్యత లేదా అంటూ ఆ మహిళా పోలీసు అధికారిని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థినులతో అనుచితంగా ప్రవర్తించిన ఎస్ఐ శిరీషపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధలో ఆందోళనలో ఉన్న విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు.ఇలాంటి పోకడలు సహించేది లేదు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకొని భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలి అని సీఎం సూచించారు. అటు ఎస్సై నుంచి వివరణ తీసుకొని అధికారులు ఆమెను విధుల నుంచి తప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: