కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్‌ కెమెరాల వ్యవహారం గ‌త రెండు రోజుల నుంచి రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. లేడీస్ హాస్ట‌ల్ లోని వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు తీశారంటూ గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు విద్యార్థినులు నిర‌స‌న చేప‌ట్టారు. ఈ ఇష్యూను సీరియ‌స్ గా తీసుకున్న ఏపీ ప్ర‌భుత్వం.. విచారణ జ‌రిపించాల‌ని అధికారుల‌కు ఆదేశించింది. ఎవరైనా నేరం చేసినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. గుడ్లవల్లేరు కళాశాల ఘటనపై నిజాలు నిగ్గు తేల్చేందుకు జేఎన్‌టీయూ ఉన్నతస్థాయి విచారణ కమిటీని నియమించింది. ఇప్పటికే గుడ్లవల్లేరు చేరుకున్న కమిటీ.. మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు కె.కృష్ణప్రసాద్, వర్ల కుమారరాజాలతో కమిటీ చర్చించింది. ఇక తాజాగా గుడ్లవల్లేరు హాస్టల్ ఇష్యూపై మ‌రోసారి ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.కాలేజీ హాస్టల్ లో ఎక్కడా హిడెన్‌ కెమెరాల్లేవ‌ని.. ఇంత‌వ‌ర‌కు ఒక వీడియో కూడా బయటకు రాలేదని లోకేశ్ స్పష్టం చేశారు. చిన్న విషయం జరిగినా దాన్ని బ్లూ మీడియా పెద్దదిగా చేసి చూపిస్తుందని మండిప‌డ్డారు. అయితే హిడెన్‌ కెమెరాలు ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నారు కదా అని మీడియా ప్రశ్నించగా.. అక్కడ కెమెరాలు ఉంటే మీరే చూపించండంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు. విద్యార్థుల‌ ఫోన్లు అన్నీ చెక్ చేశార‌ని.. ఒక్క వీడియో కూడా దొరకలేదని నారా లోకేశ్ పేర్కొన్నారు. గుడ్లవల్లేరు ఘటన కేవలం నలుగురి మధ్య లవ్‌ స్టోరీ మాత్రమే అని.. అక్కడ కెమెరాలు లేవు.. వీడియోలు లేవని స్పష్టం చేశారు. విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా, ఇప్ప‌టికే గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజిని సీఐ రమణమ్మ నేతృత్వంలోని పోలీస్ టీమ్ పరిశీలించింది. దాదాపు ప‌ది మంది విద్యార్థినుల సమక్షంలో ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించే పరికరాలతో హాస్టల్ లోని అణువణువు తనిఖీ చేశారు. ఎక్క‌డా కెమెరాలు ఉన్న‌ట్లు గుర్తించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: