ఈ సమాజంలో మానవత్వం రోజురోజుకు మంట కలిసి పోతుంది. మనిషి సాటి మనిషిని ఆదుకునే విషయంలో.. వారు కష్టాల్లో ఉంటే స్పందించే విషయంలో.. వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా అసహ్యం వేస్తుంది. వైద్యులు అంటే దేవుళ్లతో సమానం. అలాంటి వైద్యరంగంలో ఉన్నవారు పేషెంట్లకు సాయం చేయాల్సిన వారే.. వ‌క్ర‌బుద్ధితో వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ అంబులెన్స్ డ్రైవరే పేషెంట్ భార్యతో ఆస‌భ్యకరంగా ప్రవర్తించి ఆమె భర్తకు పెట్టిన ఆక్సిజన్ తొలగించిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆ పేషెంట్ ప్రాణాలు కోల్పోయారు. సిద్ధార్థ నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ గత నెల 28న ఘాజీపూర్‌లోని అరావళీ మార్గ్‌లో ఉన్న ఒక ఆసుపత్రిలో భర్తను చేర్పించింది.


అక్కడ ఖర్చు తట్టుకోలేక తన భర్తను ఇంటికి తీసుకువెళ్తానని వైద్యులను వేడుకొంది. దీంతో వారు ఆమెకు అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ ఇచ్చారు. ఆ మహిళ అంబులెన్స్ లో తన భర్తను సోదరుడిని తీసుకుని సిద్ధార్థ నగర్‌లోని తన ఇంటికి బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించే ముందు ఆ డ్రైవర్ ఆమెను తనతో పాటు ముందు సీట్లో కూర్చోవాలని.. అలా అయితే రాత్రివేళ పోలీసులు మార్గమధ్యంలో ఆపరని చెప్పారు. దీంతో ఆ డ్రైవర్ మాటలు నమ్మిన.. ఆ పేషెంట్ భార్య అలాగే చేసింది. అయితే మార్గమధ్యలో డ్రైవర్ అతడి సహాయకుడు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీనికి సదరు మహిళ అభ్యంతరం తెలిపింది. మరోవైపు వీరి ప్రవర్తనను గమనించిన ఆమె భర్త, సోదరుడు కేకలు వేయటం మొదలుపెట్టారు.


దీంతో చ‌వాన్ పోలీస్ స్టేషన్ రోడ్‌లో వారు అంబులెన్స్ ఆపేశారు. ఆమె భర్తను రోడ్డు పక్కన దించేసి.. ఆక్సిజన్ తొలగించి వెళ్ళిపోయారు. సదర మహిళ వద్ద పదివేలు నగదు, కొన్ని ఆభరణాలు లాక్కుని మరి వారు వెళ్లారు. దీంతో ఆ మహిళతో పాటు.. ఆమె సోదరుడు 112, 108 నెంబర్లకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో తక్షణమే పోలీసులు స్పందించి అక్కడకు చేరుకుని ఆమె భర్తను మరో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని పరిస్థితి విషమించడంతో గోరఖ్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఏడీసిపి జితేంద్ర మాట్లాడుతూ.. తమ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు నిజంగా మానవత్వం ఎలా మంటగలుస్తుందో చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: