దసరా పండుగ వేళ తమ తమ సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో దసరాకు, సద్దుల బతుకమ్మకు ఊర్లకు వెళ్లేవారికి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని శుభవార్త చెబుతూనే, ఇదే సమయంలో ఊహించని షాక్ ఇచ్చింది.సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు తమ సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, పక్క రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. ఈ క్రమంలోనే ఓ ఆర్టీసీ బస్సులో చెకింగ్ అధికారులపై ప్యాసింజర్స్ సీరియస్ అయ్యారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్న తుమ్మలగూడెంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అర్ధరాత్రి 11 గంటలకు రన్నింగ్ బస్సును ఆపి మహిళల ఆధార్ కార్డులను ఆర్టీసీ చెకింగ్ స్వ్కాడ్ తనిఖీలు చేసింది.

దీంతో పలువురు ప్యాసింజర్స్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆధార్ కార్డులు చూపించాకే టికెట్ ఇచ్చాక ఇప్పుడు మళ్లీ తనిఖీలు ఏంటని వారిని ప్రశ్నించారు. అధికారుల చర్యలతో అసహనానికి గురైన మహిళలు సైతం మాకు మీ ఫ్రీ బస్ వద్దు.. ఏమీ వద్దు అంటూ ఫైర్ అయ్యారు.ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్తామని పలువురు ప్రయాణికులు చెప్పడంతో అధికారులు వెంటనే దిగి వెళ్లిపోయారు. ఆర్ధరాత్రి ఈ చెకింగ్‌లు ఏంటీ సార్? అంటూ ఎండీ సజ్జనార్‌కు ఈ వీడియోను ట్యాగ్ చేశారు.ఇదిలావుండగా రాష్ట్రవ్యాప్తంగా 6, 304 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి సొంత ఊళ్ళకి వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచుతున్నట్టు టీజీ ఆర్టీసీ పేర్కొంది. ఈసారి మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రద్దీ కారణంగా గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 స్పెషల్ సర్వీస్ లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.ఇప్పటికే దసరా పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వాళ్ళు ప్రయాణాలు ప్రారంభించగా బస్సులలో టికెట్ ధరల పైన వారిలో అసహనం వ్యక్తం అవుతుంది. అయితే అన్ని బస్సులలోనూ టికెట్ చార్జీలు పెంచలేదని ప్రత్యేక బస్సులలో మాత్రమే టికెట్ చార్జీలను పెంచినట్టుగా అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: