ఆమె తయారు చేసే సాధారణమైన శాకాహారి వంటకాలు చాలా మందికి బాగా నచ్చుతాయి. ముసలి వయసులో, కష్టమైన సమయాల్లో కూడా మనకున్న ప్యాషన్ జీవితాన్ని మార్చగలదని ఆమె ప్రూవ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిషా మధులిక ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా ఉండేవారు. పిల్లలు పెద్దవై ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆమె చాలా ఒంటరిగా ఫీల్ అయ్యేవారు. ఈ ఒంటరితనాన్ని మరచిపోవడానికి ఆమెకు వంట చేయడం అలవాటుగా ఉండేది. ఆమెకు వంట చేయడం ఎప్పుడూ ఇష్టమే. ఈ ప్యాషన్ ను బాగా ఉపయోగించుకునేందుకు 2007లో ఆమె తన వంటకాలను ఇతరులతో పంచుకోవడానికి ఒక బ్లాగ్ ప్రారంభించారు. ఆమె సులభంగా చేయగలిగే వంటకాలు చాలా మందికి నచ్చాయి. వారి నుంచి వచ్చిన మంచి ప్రతిస్పందన ఆమెకు మరింత స్ఫూర్తిని ఇచ్చింది.
2011లో నిషా మధులిక తన జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఉపాధ్యాయురాలి ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఇంటి వంటకాలను హిందీలో చాలా సింపుల్ గా వివరించే వీడియోలు చేయడం ప్రారంభించారు. ఆమె వంటలను తయారు చేయడం చాలా సులభంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఆమె వీడియోలను చూడటం మొదలుపెట్టారు. ఆమె సబ్‌స్క్రైబర్ల సంఖ్య క్రమంగా పెరగసాగింది.
2017లో ఆమెకు ఒక గొప్ప గౌరవం లభించింది. సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్‌లో "టాప్ యూట్యూబ్ కుక్‌కింగ్ కంటెంట్ క్రియేటర్" అనే అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపుతో ఆమె గురించి ది ఎకనామిక్ టైమ్స్ వంటి పెద్ద పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు నిషా మధులికకు యూట్యూబ్‌లో 14.5 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె నికర విలువ దాదాపు 43 కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది. ఇండియాలో అత్యంత సంపన్నమైన మహిళా యూట్యూబర్‌గా ఆమె నిలిచింది.