ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ వ్యక్తి తనకు పిల్లలు కలగడం లేదని ఎవరో ఇచ్చిన సలహాని గుడ్డిగా ఫాలో అవుతూ... ఏకంగా క్షుద్రపూజలు చేసేవాడి దాగరకు వెళ్ళాడు. దాంతో సదరు తాంత్రికుడు కోడిపిల్లను మింగమని చెప్పగా, బాధితుడు మింగబోయి ప్రాణాలు కోల్పోయాడు. అయితే తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని డాక్టర్లు అనుమానించి, ఈ క్రమంలో అతనికి పోస్ట్‌మార్టం నిర్వహించగా గొంతులో కోడిపిల్ల కనిపించడంతో అవాక్కయ్యారు.
వివరాల్లోకి వెళితే... అంబికాపూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధి చింద్‌క గ్రామానికి చెందిన ఆనంద్ కుమార్ యాదవ్ (36)కు పెళ్లై ఐదు సంవత్సరాలు అయినా సంతానం కలగలేదు. ఈ క్రమంలో డాక్టర్లు దగ్గరికి వెళ్లినా వారి సమస్య తీరలేదు. దాంతో ఎవరో ఇచ్చిన సలహాతో ఓ మంత్రగాడిని కలిసాడు. ఆ తాంత్రికుడి సూచన మేరకు క్షుద్ర పూజల అనంతరం.. బతికి ఉన్న కోడి పిల్లను మింగడానికి యత్నం చేసాడు. దీంతో ఆ కోడిపిల్ల గొంతులో ఇరుక్కుపోయింది. ఇంకేముంది... కట్ చేస్తే, ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తరువాత పోస్ట్‌మార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ సంతు బాగ్ 15,000 శవపరీక్షలలో తాను ఇలాంటి కేసును చూడలేదని.. పిల్లలు పుట్టకపోతే తాంత్రికుడిని కలవడం ఏంటని.. ఇంకా ఇలాంటివాళ్ళు ఉన్నారా? అనే అనుమానాన్ని వ్యక్తం చేసారు.