సాధారణంగా వేసవిలోనే అందుబాటులోకి వస్తాయి తాటి ముంజెలు, మామిడి పండ్లు. సరిగ్గా ఎండలు మండుతున్న తరుణంలో ఇవి పక్వానికి వస్తాయి.తాటి ముంజెలు అయితే ఎండలు ప్రారంభంలో, మామిడి పండ్లు అయితే కటిక వేసవిలో పక్వానికి రావడం చూస్తుంటాం. అటువంటిది డిసెంబరులోనే మార్కెట్లోకి వచ్చే అంటే అది ఆశ్చర్యకరమే. కానీ అది నిజం. ప్రస్తుతం ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్లు పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలో రోడ్ల పక్కన షాపులు వెలుస్తుండడం ఆసక్తికరంగా మారుతోంది. కొందరు వీటిని కొనుగోలు చేస్తుండగా.. మరి కొందరు మాత్రం విచిత్రంగా చర్చించుకుంటున్నారు. డిసెంబర్లో ఇది ఎలా సాధ్యం అని? ప్రశ్నించుకుంటున్నారు. అసలు విషయం తెలుసుకొని ఉపశమనం పొందుతున్నారు.



ఏటా వేసవి కాలంలో ఏప్రిల్ నెలలో తాటి ముంజల సీజన్ ఉంటుంది. జనాలు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు రోడ్ల పక్కన డిసెంబర్ లోనే తాటి ముంజల విక్రయాలు చేస్తుండడం విశేషం. విజయవాడలోని బందరు రోడ్డులో గల గంగూరు సమీపంలో డజను తాటి ముంజులను రూ.100 నుంచి రూ.120కి విక్రయిస్తున్నారు. జనాలు కూడా ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మామిడిపండ్ల షాపులు కూడా రోడ్డు పక్కన కనిపిస్తున్నాయి. విజయవాడ కృష్ణలంక సమీపంలో రోడ్డుపై విక్రయిస్తున్నారు. వీటిని కిలో రూ.250 నుంచి రూ.300 వరకు విక్రయిస్తుండడం విశేషం.


అయితే వేసవిలో అందుబాటులోకి రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు డిసెంబర్లో ఎలా వచ్చాయి అని ఆరా తీస్తే..ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇవి పైరు కాపు ఉత్పత్తులని.. వందల చెట్లను కొన్ని ఇలా ముందే కాస్తాయని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రాంతంలో తోటల్లోని రెండు వేల చెట్లను మామిడిపండ్లు దిగుబడికి వచ్చాయట. నాలుగు టన్నుల మామిడి పండ్లు దిగుబడికి రావడంతో ఇలా మార్కెట్లోకి తెచ్చి రైతులు విక్రయిస్తున్నారు. అటు తాటి ముంజల పరిస్థితి కూడా అదే. పైరుకాపు చెట్ల నుంచి తాటి ముంజలు వస్తుండడంతో.. సేకరిస్తున్న గీత కార్మికులు ఇలా విజయవాడ తెచ్చి విక్రయిస్తున్నారు. మొత్తానికి అయితే విజయవాడ నగరంలో ఇప్పుడు తాటి ముంజలతో పాటు మామిడి పండ్లు చర్చకు కారణం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: