ట్వాంజ్వా అనే అడవి పండ్లు తింటూ, కర్రలతో నీళ్లు తవ్వుకుంటూ ఆ పిల్లాడు ప్రాణాలతో ఉండటం నిజంగా అద్భుతం. కరువు ప్రాంతాల్లో ఇలా నీళ్లు వెతకడం సర్వసాధారణం కాబట్టే, ఆ నైపుణ్యం టినోటెండాను కాపాడింది. రేంజర్లు అతన్ని వెతికినప్పుడు, నీరసంగా, డీహైడ్రేషన్‌తో ఉన్నాడు కానీ, ప్రాణాలతో ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
స్థానిక ఎంపీ పి. ముత్సా మురోమ్‌బెడ్జీ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ.. "సింహాలు, ఏనుగుల్లాంటి భయంకరమైన జంతువులుండే మటుసడోనా పార్క్‌లోకి ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. హోగ్వే నది దగ్గర ఐదు రోజులున్నాడు. సింహాలు గర్జిస్తున్నా భయపడకుండా, రాళ్లపైనే నిద్రపోతూ, పండ్లు తింటూ బతికాడు" అని చెప్పారు. మటుసడోనా పార్క్‌లో దాదాపు 40 సింహాలున్నాయి. ఒకప్పుడు ఆఫ్రికాలోనే అత్యధిక సింహాలున్న ప్రాంతాల్లో ఇది ఒకటి.
టినోటెండాను కాపాడటంలో ఊరివాళ్లంతా ఒక్కటయ్యారు. రాత్రుళ్లు డప్పులు వాయిస్తూ అతనికి దారి చూపించారు. రేంజర్లు, ఊరివాళ్లు కలిసి వెతకడం వల్లే ఆ పిల్లాడు దొరికాడు. "పార్క్ రేంజర్లు, న్యామిన్యామి సమాజం, వెతకడంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ మా కృతజ్ఞతలు. టినోటెండాను కాపాడిన దేవుడికి ప్రత్యేక ధన్యవాదాలు" అని ఎంపీ మురోమ్‌బెడ్జీ అన్నారు. ఈ కథ ఆశ, ఐక్యత, ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమని చెప్పకనే చెబుతోంది.