
అనంతపురం జిల్లాలో ఆత్మకూరు నుంచి కళ్యాణ్ దుర్గం వెళ్లే దారిలో పి కొత్తపల్లి అనే పల్లె ఉన్నది.. ఈ ప్రాంతంలో ఎక్కువగా కమ్మ ,బోయ ,ఎస్సీ ఇతర కులాల వారు ఉన్నారు. సుమారుగా 300 కుటుంబాలు ఈ గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. కొన్నేళ్లుగా ఈ గ్రామంలో సంక్రాంతి పండుగను అసలు జరుపుకోలేదట. అయితే ఆ గ్రామస్తులు తమ పూర్వీకుల నుంచి ఒక కథను చెబుతూ ఉండడం వల్ల ఆ ఊరిలోని ప్రజలు సంక్రాంతికి జరుపుకోరట.
పూర్వపు రోజుల్లో కొత్తపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను జరుపుకునేవారని అలా ఒకసారి సంక్రాంతి పండుగ కోసం సరుకులు కొనడానికి వెళ్లిన ఒక వ్యక్తి ఆత్మకూరు సంతకు వెళ్ళగా ఆ సమయంలో ఆ వ్యక్తి కుప్పకూలి మరణించారట.. ఆ విషయాన్ని లైట్ గా తీసుకున్న ఆ మరుసటి రోజు అలాగే సంతకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు మరణించడంతో ఆ గ్రామంలో కాస్త భయం పుట్టుకుందట.. అలా కొన్ని సంవత్సరాలు సంతకు వెళ్లినవారు ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో ఆ ఊరికి సంక్రాంతి అంటే భయం పట్టుకుందట. దీంతో సంక్రాంతి పండుగ చేసుకుంటే ఏదో ఒక అనర్ధం జరుగుతుందని గ్రామ ప్రజలు భయపడడంతో అప్పటినుంచి ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారట. కొంతమంది ఈ ఊరిలో అసలు సంక్రాంతి పండుగకు స్నానం కూడా చేయరని సమాచారం.