చైనాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతి తన పెంపుడు పిల్లి చేసిన పనికి ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. చైనాలోని చోంగ్‌కింగ్‌కు చెందిన ఆ యువతి ఏకంగా తొమ్మిది పిల్లులను పెంచుకుంటోంది. అయితే, ఇటీవల ఆమె తన ఉద్యోగానికి రాజీనామా లేఖ రాసింది. కానీ, దాన్ని పంపాలా వద్దా అని తీవ్రంగా ఆలోచిస్తోంది. ఎందుకంటే, ఆ ఉద్యోగం ఉంటేనే కదా వాటికి తిండి పెట్టేది, వాటిని బాగా చూసుకునేది.

పంపాలా వద్దా అని మథనపడుతున్న సమయంలోనే అసలు ట్విస్ట్ జరిగింది. ఆమె టేబుల్ మీద ఉన్న ల్యాప్‌టాప్‌పైకి ఒక్కసారిగా ఓ పిల్లి దూకింది. అంతే, ఆ తొందర్లో ఆ పిల్లి కాలు అనుకోకుండా ఎంటర్ బటన్ మీద పడింది. క్షణాల్లో ఆ రాజీనామా లేఖ బాస్‌కు చేరిపోయింది.

షాక్ తిన్న ఆ యువతి వెంటనే బాస్‌కు ఫోన్ చేసింది. జరిగిన విషయం చెప్పింది. పిల్లే పొరపాటున పంపిందని ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు. అంతేకాదు, ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించేశారు. ఫలితంగా ఆమె ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, ఏడాది చివర్లో వచ్చే బోనస్‌ను కూడా పోగొట్టుకుంది.

ఇప్పుడు ఆమె కొత్త ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ, తొమ్మిది పిల్లుల పోషణకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతోంది. ఈ విషయం చైనా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు మాత్రం ఈ ఘటనపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. "పిల్లి కావాలనే అలా చేసి ఉంటుంది.. బోనస్ డబ్బులు ఇవ్వకుండా బాస్‌కు హెల్ప్ చేసిందేమో" అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల థాయ్‌లాండ్‌లో జరిగిన మరో ఘటన గురించి తెలుసుకుంటే గుండెలు అదిరిపోతాయి. ఓ సైనికుడి ఇంటికి అతని పెంపుడు కుక్క బాంబును తీసుకొచ్చింది. సార్జెంట్ మేజర్‌గా పనిచేస్తున్న ఆ సైనికుడు తన నాలుగేళ్ల కొడుకు చేతిలో పేలుడు పదార్థం ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

ఆయన లాబ్రడార్-గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందిన కుక్క ఆ ప్రాంతంలో ఎక్కడో పడి ఉన్న బాంబును తీసుకొచ్చి వాళ్ల పెరట్లో పడేసింది. ఆ కుక్కకు గుండ్రంగా ఉండే వస్తువులతో ఆడుకోవడం అలవాటు. బంతులను తెచ్చి ఇవ్వడం దాని హాబీ. ఈసారి మాత్రం నల్లటి టేప్‌తో చుట్టి ఉన్న బాంబును బంతి అనుకుని తీసుకొచ్చింది.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. ఆ పేలుడు పదార్థాన్ని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. అదృష్టవశాత్తూ కుక్క దాన్ని మోసుకొచ్చే సమయంలో అది పేలలేదు. లేదంటే ఊహించడానికే భయంకరంగా ఉంది. "దేవుడి దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదు" అంటూ ఆ సైనికుడు ఊపిరి పీల్చుకున్నాడు. ఈ రెండు ఘటనలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: