కొన్ని సందర్భాలలో సోషల్ మీడియాలో ఒక్క వీడియో వైరలయితే చాలు జీవితం మారిపోతుంది. అందుకే చాలామంది క్రియేటర్లు డేంజరస్ స్టంట్స్ చేస్తూ, వింత వింత పనులు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. కొందరు శృతి మించి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా రష్యాకు చెందిన 'ష్కోడలేరా' అనే డాన్సర్ చేసిన వీడియో చూస్తే మీరు షాక్ అవుతారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన ఈ అమ్మడు.. జనవరి 1న ఒక వీడియో పోస్ట్ చేసింది. అందులో ఒక భారీ పాముతో ఫోజులిస్తూ క‌నిపించింది. అందరి దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చేసిన ఈ వీడియో కాస్తా బెడిసి కొట్టింది. అనుకోకుండా ఆ పాము ఒక్కసారిగా ఆమె ముఖంపై దాడి చేసింది. అంతే, క్షణాల్లో ఆమె ముక్కును కొరికేసింది. పాము కోరలు ఆమె ముక్కులోకి దిగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. అయితే అదృష్టం కొద్దీ అది విషపూరితం కాని పాము కావడంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది. చిన్న గాయంతో సరిపెట్టుకుంది.

పాము కాటేసిన తర్వాత ఎవరైనా భయంతో వణికిపోతారు.. లేదంటే గట్టిగా కేకలు వేస్తారు. కానీ ఈ డాన్సర్ మాత్రం అలా చేయలేదు. పాము ముక్కు కొరికినా కూడా ఏ మాత్రం కంగారు పడకుండా చాలా కూల్‌గా రియాక్ట్ అయింది. నొప్పిని భరిస్తూనే చాలా నెమ్మదిగా ఆ పామును పట్టుకుని కిందకు దించేసింది. ఆమె చూపించిన ధైర్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఈ వీడియో చూసి నవ్వుకున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన పనిని తప్పుబట్టారు. "జంతువులను కంటెంట్ కోసం వాడకూడదు.. పాము భయపడి ఉంటుంది" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. "పాము కూడా ఫేమ్ కావాలంటోంది." అని మరొకరు సరదాగా కామెంట్ చేశారు.

కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెపై సీరియస్ అయ్యారు. ఇలా జంతువులను హింసించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. "వినోదం కోసం వన్యప్రాణులను ఉపయోగించడం ఆపండి." అంటూ కామెంట్స్ చేశారు. అయితే మరికొందరు మాత్రం ఆమె చూపించిన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. "ఆమె చాలా బాగా హ్యాండిల్ చేసింది" అంటూ ప్రశంసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: