అయితే, ఇప్పుడు మాత్రం మిస్టర్ పింగ్ తన నిర్ణయం పట్ల తీవ్రంగా చింతిస్తున్నాడు. "నేను సమయాన్ని వెనక్కి తిప్పగలిగితే, కచ్చితంగా ప్రభుత్వం ఆఫర్‌ను అంగీకరించేవాడిని. ఇప్పుడు ఇది పెద్ద పందెం ఓడిపోయినట్టు ఉంది" అంటూ తన బాధను వ్యక్తం చేశాడు. "కొంచెం కాదు, చాలానే బాధగా ఉంది" అని ఆయన వాపోయాడు.
ప్రభుత్వం మిస్టర్ పింగ్‌కు మొదట 1.6 మిలియన్ యువాన్లు (భారతీయ కరెన్సీలో రూ. 1.9 కోట్లు), రెండు ఆస్తులను ఆఫర్ చేసింది. ఆ తర్వాత మరో ఆస్తిని కూడా కలిపి మొత్తం మూడు ఆస్తులను ఇస్తామని చెప్పింది. కానీ, ఆ ఆఫర్ తనకు నచ్చలేదని ఆయన తిరస్కరించాడు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన ఇల్లు హైవే మధ్యలో చిక్కుకుపోయింది. ఇంటికి వెళ్లాలంటే ఒక పెద్ద పైపు గుండా వెళ్లాల్సి వస్తోంది. ఆయన ఇంటి పైకప్పు రోడ్డుకు దాదాపు సమాన ఎత్తులో ఉంది.
నిర్మాణం జరుగుతున్న సమయంలో దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండటంతో మిస్టర్ పింగ్ తన 11 ఏళ్ల మనవడితో కలిసి రోజంతా పట్టణ కేంద్రంలోనే ఉంటున్నారు. రాత్రి నిర్మాణం ఆగిపోయాక ఇంటికి తిరిగి వస్తున్నారు. కానీ, హైవే తెరుచుకున్నాక నిరంతరం వాహనాల రాకపోకలతో వచ్చే శబ్ద కాలుష్యం తమ ప్రశాంత జీవితానికి పెద్ద ఆటంకం కలిగిస్తుందని ఆయన ఆందోళన చెందుతున్నాడు.
ఇదిలా ఉండగా, మిస్టర్ పింగ్ ఇల్లు ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. చాలా మంది సందర్శకులు రోడ్డు మధ్యలో ఉన్న ఆ ఇంటిని చూడటానికి, ఫోటోలు దిగడానికి వస్తున్నారు. ఇంత మంది చూస్తున్నా, తన నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని మిస్టర్ పింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కోట్లు వద్దనుకుని, ఇప్పుడు హైవే మధ్యలో ఒంటరిగా మిగిలిపోయాడు.