కొంతమంది కష్టపడి సంపాదించలేరు కానీ వారికి ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం.. ఇవన్నీ అనుభవించాలని ఉంటుంది. అందుకే ఈజీ మనీ కోసం పాకులాడుతుంటారు. ఆ క్రమంలో చాలామంది నేరాల బాట పడుతున్నారు. అలా అక్రమంగా డబ్బు సంపాదించాలనుకున్న ఓ వ్యక్తి.. పోలీసుల కళ్లుగప్పి దాదాపు ఒకటిన్నర సంవత్సరం తప్పించుకు తిరిగాడు. కానీ చివరికి దేవుడి దగ్గరే దొరికిపోయాడు, అసలేం జరిగిందంటే..

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాకు చెందిన 22 ఏళ్ల ప్రవేశ్ యాదవ్ అనే యువకుడు అక్రమ మద్యం వ్యాపారంతో బాగా డబ్బు సంపాదించాలని అనుకున్నాడు. 2023, జులై పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అయితే పోలీసులకు చిక్కకుండా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అప్పటినుంచి దాదాపు సంవత్సరంన్నరగా పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు.

ఇంతలో మహా కుంభమేళ రావడంతో ప్రవేశ్ యాదవ్‌కు ఒక ఆలోచన వచ్చింది. కుంభమేళలో పవిత్ర స్నానం చేస్తే పాపాలు పోతాయని చాలామంది నమ్ముతారు కదా. అలా తన పాపాలు కూడా పోతాయని అనుకున్నాడేమో, ప్రయాగ్‌రాజ్‌కు వచ్చేశాడు. అక్కడ పుణ్యస్నానం చేసి హాయిగా తిరిగి వెళ్లిపోదామని ప్లాన్ వేశాడు. కానీ అతనికి తెలియదు.. అక్కడ పోలీసులు పక్కా నిఘా పెట్టారని!

కుంభమేళలో భక్తుల రద్దీని అదునుగా తీసుకుని నేరస్తులు కూడా వస్తారని పోలీసులు ముందే ఊహించారు. అందుకే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సాధారణ భక్తుల్లాగే ప్రవేశ్ యాదవ్ కూడా కుంభమేళకు వచ్చాడు. కానీ పోలీసుల నిఘా కళ్ళు అతన్ని గుర్తుపట్టాయి. వెంటనే చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఒక్కసారిగా షాక్ తిన్న ప్రవేశ్ యాదవ్.. లబోదిబోమంటూ మొహం చాటేసుకున్నాడు.

భదోహి పోలీస్ సూపరింటెండెంట్ అభిమన్యు మంగ్లిక్ తెలిపిన వివరాల ప్రకారం.. 2023, జులై 29న నేషనల్ హైవే-19పై వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పట్టుకున్నారు. అప్పుడు ప్రదీప్ యాదవ్, రాజ్ దోమోలియా అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కానీ ప్రవేశ్ యాదవ్ మాత్రం పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. వీరంతా అల్వార్ జిల్లాకు చెందినవారని, చాలాకాలంగా బీహార్‌కు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. వీరిపై ఐపీసీ, ఎక్సైజ్ చట్టం, గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇలా పాపాలు పోగొట్టుకోవడానికి కుంభమేళకు వచ్చిన ప్రవేశ్ యాదవ్.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: