మరీ ముఖ్యంగా... పుణ్యక్షేత్రాల పరిసర ప్రాంతాల్లో చిరుతలు, పులులు సంచరిస్తూ భక్తులను, స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఒక్కోసారి వీరిపై దాడులు జరిగి, ప్రాణాలు కూడా కోల్పోతున్న పరిస్థితి ఉంది. విషయంలోకి వెళ్తే... తాజాగా కొమురం భీం జిల్లాలో చిరుత సంచారం ప్రజలను పరుగెత్తించేలా చేసింది. అయితే ప్రజలను పరుగులు పెట్టించిన చిరుతను గ్రామ సింహం ఉరుకులు పెట్టించడంతో ట్విస్ట్ చోటు చేసుకుంది. సాధారణంగా పులులు, చిరుతల ప్రధాన ఆహారం అడవి పందులు. అడవుల్లో అడవి పందుల సంఖ్య తగ్గిపోవడంతో చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రూర మృగాల ప్రత్యామ్నాయ ఆహారం కుక్కలు కావడంతోనే జనావాసాల్లోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.
ఇక గ్రామంలోకి ఎంటరయిన చిరుతను సదరు కుక్క తరమడంతో అది భయంతో అక్కడే ఉన్న ఓ ఎత్తయిన చెట్టుపైకి ఎక్కి చిటారు కొమ్మన కూర్చుంది. దానిని చూసి శునకం మొరుగుతూ ఉండగా జనాలు తమ ఫోన్లకు పని చెప్పారు. ఆ తరువాత స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది ఈ మొత్తం తంతు తాలూక వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు, సిబ్బంది చిరుత పాదముద్రలు సేకరించారు. చిరుతను బంధించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.