తాజగా కోయిలాండి సమీపంలోని, మనకులంగర ఆలయంలో దారుణం చోటుచేసుకుంది. సదరు ఆలయంలో జరిగిన ఉత్సవ వేడుకలో భాగంగా భక్తులు బాణసంచా పేల్చడంతో, 2 ఏనుగులు భయాందోళనలకు గురై, బెంబేలెత్తి పరుగెత్తడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఆ తొక్కిసలాటలో ముగ్గురు వృద్ధులు అక్కడికక్కడే మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఆలయ ఉత్సవం కోసం ఏనుగులను తీసుకువచ్చినప్పుడు ఈ ఘటన చోటుచేసుకోగా... అవి ఆందోళన చెంది మందిరం సమీపంలోని ఒక చిన్న భవనం వైపు పరిగెత్తాయని, ఈ క్రమంలో ఏనుగులు భవనాన్ని ఢీకొట్టినప్పుడు, దాని గోడలోని ఒక భాగం కూలిపోయిందని, ఆ సమయంలో కొంతమంది దాని కింద చిక్కుకున్నారని సమాచారం.

ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అందిన సమాచారం ప్రకారం, గోడ కూలిపోవడం వల్ల ఇద్దరు మహిళలు మరియు ఒక పురుషుడు మరణించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కోయిలాండి పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు స్పందిస్తూ... "భక్తులు చేసిన పనికి ఏనుగులు భయపడి పరుగెత్తాయి. దాంతో ప్రజలు కూడా భయాందోళనలకు గురయ్యారు. దీని ఫలితంగా తొక్కిసలాట జరిగింది. దీని ఫలితంగా ముగ్గురు చనిపోగా... దాదాపు 20 మంది వరకు గాయపడ్డారు!" అని  తెలిపారు. ఈ సంఘటన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి "పినరయి విజయన్" మరణించినవారికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఇది ఒక విషాదకరమైన సంఘటన! అని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర అటవీ మంత్రి ఎకె శశీంద్రన్ జిల్లా కలెక్టర్ మరియు ఉత్తర ప్రాంత చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ (సోషల్ ఫారెస్ట్రీ) నుండి అత్యవసర నివేదిక కావాలని కోరారు. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని, కేరళ క్యాప్టివ్ ఎలిఫెంట్స్ (నిర్వహణ మరియు నిర్వహణ) నిబంధనల ఉల్లంఘన జరిగిందా? అనే దానిపై కూడా దర్యాప్తు ముమ్మురం చేస్తామని మంత్రి తెలిపారు. ఇకపొయే ఈ సంఘటనలో గాయపడిన వారికి చికిత్స కోసం కోయిలాండి తాలూకా ఆసుపత్రి మరియు కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించినట్టు భోగట్టా.

మరింత సమాచారం తెలుసుకోండి: