
చాలామంది రద్దీ రైళ్లలో సీటు కోసం నానా తంటాలు పడుతుంటారు. కొందరు సొంత కుర్చీలు తెచ్చుకుంటే, మరికొందరు తాళ్లతో ఊయలలు కట్టుకుంటారు. కానీ ఈ బాబా మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ మరో లెవెల్‌కు వెళ్ళిపోయాడు. కనీసం నిలబడటానికి కూడా చోటు లేని ఆ రైలులో, ఆయన లగేజీ రాక్‌పైకి ఎక్కి తలకిందులుగా వేలాడాడు. కాళ్ళు పైకి, చేతులు రాక్‌ను గట్టిగా పట్టుకుని, హాయిగా నిద్రపోతున్నట్టు కనిపించాడు.
రైలులో ఉన్న ప్రయాణికులు ఈ వింత దృశ్యాన్ని నోరెళ్ళబెట్టి చూశారు. ఒకవేళ పట్టు తప్పితే తమ మీద పడతాడేమో అని భయపడ్డారు. కానీ బాబా మాత్రం చాలాసేపు కదలకుండా అలానే వేలాడుతూ ఉన్నాడు. కొందరు ఈ సీన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది.
ఈ వీడియోకు ఇప్పటికే 1.36 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. కొందరైతే స్పైడర్‌మ్యాన్ కూడా ఇలా చూస్తే షాక్ అవుతాడని జోకులు పేల్చుతున్నారు. వయసు పైబడిన ఇలాంటి వారికి సీటు ఇవ్వాలని, గౌరవించాలని ఇంకొందరు అంటున్నారు. చాలామంది నవ్వుతున్న ఎమోజీలతో రియాక్ట్ అవుతుంటే, మరికొందరు మాత్రం ఇది చాలా ప్రమాదకరమైన విన్యాసం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వింత రైలు ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్తేమీ కాదు. కానీ ఈ బాబా మాత్రం రద్దీ రైలుకు తనదైన స్టైల్‌లో చెక్ పెట్టి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.