అవును, మీరు విన్నది నిజమే. సోషల్ మీడియా నేడు పచ్చనైన కాపురాలలో చిచ్చు పెడుతోంది. నేడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్ వచ్చి చేరడంతో పలు చోట్ల నేరాలు - ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వాట్సాప్ లో పంపిన 'ముద్దు' ఎమోజీ అనేది రెండు ప్రాణాలను బలి తీసుకుంది. అవును... చిన్న అనుమానం ప్రాణాలు కడతేర్చే వరకు వదిలిపెట్టలేదు. కేరళలో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురి చేస్తోంది. తన భార్యకు ఆమె స్నేహితుడు పంపిన వాట్సాప్ మెసేజ్ ఏకంగా ఇద్దరు ప్రాణాలు తీసింది అంటే మీరు నమ్ముతారా?

విషయంలోకి వెళితే... కేరళలోని పథనంతిట్ట జిల్లా కలంజూరుకు చెందిన 'బైజు' తన భార్య 'వైష్ణవి'తో కలిసి కాపురం ఉంటున్నాడు. దాదాపు 10 ఏళ్ళ క్రితం వీరికి వివాహం కాగా... పదేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులను వీరు కలిగి ఉన్నారు. వీళ్ళ ఇంటి పక్కనే 'విష్ణు' అనే 30 ఏళ్ల యువకుడు తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇరుగు పొరుగు వారు కావడంతో వైష్ణవి, విష్ణుకి పరిచయం ఏర్పడి, అది కాస్త సోషల్ మీడియాలో మెసేజెస్ చేసుకొనే స్థాయికి పెరిగింది. ఈ క్రమంలోనే వైష్ణవికి విష్ణు ముద్దు ఎమోజీ పంపాడు. ఇది గమనించిన బైజు తన భార్య వైష్ణవితో గొడవకు దిగాడు. తాను ఏం చెబుతున్నా భర్త వినకపోవడంతో భయంతో వైష్ణవి పక్కింట్లోకి పారిపోయింది. కట్ చేస్తే... వారి మధ్య ఏదో సంబంధం ఉందని తీవ్ర ఆవేశానికి గురైన బైజు కొడవలి తీసుకుని విష్ణు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే ఘోరం జరిగిపోయింది.

కొడవలి చేతబట్టిన బైజు భార్య వైష్ణవి ని బయటకి లాక్కొచ్చి మరీ కొడవలితో నరికేశాడు. ఈ క్రమంలో అడ్డొచ్చిన విష్ణుని సైతం కొడవలితో వేటు వేసాడు. ఇది గమనించిన స్థానికులు బైజును అడ్డుకొని గాయపడిన వైష్ణవి విష్ణును ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు చనిపోయారని డాక్టర్స్ నిర్ధారించారు. ఇక స్థానికుల నుంచి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు బైజును అరెస్ట్ చేయగా సోషల్ మీడియాలో తన భార్య వైష్ణవికి విష్ణు పంపిన ముద్దు ఎమోజి వలెనే రెండు హత్యలు చేసానని, వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులకు చెప్పాడు. భార్య తనని మోసం చేసినందుకే హత్య చేయాల్సి వచ్చిందని నేరాన్ని అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: