
యూట్యూబ్‌లో రాత్రింబగళ్లు వీడియోలు చూసి తెగించి మరీ ఆపరేషన్ చేయాలని ఫిక్సయ్యాడు. వెంటనే మెడికల్ షాపుకు వెళ్లి సర్జికల్ బ్లేడ్, కుట్లు వేసే సామాగ్రి, మత్తు ఇంజెక్షన్లు కొనుక్కొచ్చాడు. బుధవారం ఉదయం తన గదిలోనే ఆపరేషన్ మొదలుపెట్టాడు రాజాబాబు.
కొంతసేపటి తర్వాత మత్తు ఇంజెక్షన్ ప్రభావం తగ్గిపోవడంతో ఒక్కసారిగా నొప్పి మొదలైంది. నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశాడు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అసలేం జరిగిందో తెలుసుకుని వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
రాజాబాబు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆగ్రాలోని ఎస్ఎన్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై రాజాబాబు మేనల్లుడు రాహుల్ మాట్లాడుతూ.. "మామయ్య యూట్యూబ్ వీడియోలు చూసి ఆపరేషన్ చేసుకున్నాడు" అని తెలిపారు. సుమారు 18 ఏళ్ల క్రితం రాజాబాబుకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగిందని, కొద్ది రోజులుగా కడుపు నొప్పి రావడంతో చాలా మంది డాక్టర్లను కలిసినా ఫలితం లేకపోవడంతో ఇలా చేశాడని రాహుల్ వివరించారు.
ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని, ప్రాణాలతో చెలగాటమాడవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి వైద్యం చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని డాక్టర్లు అంటున్నారు. చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లడం లేదా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారు మీకు గనుక తెలిసి ఉంటే వారిని హెచ్చరించడం మంచిది.