చిలకలు మనుషుల్లా మాట్లాడటం మనం చాలాసార్లు చూసుంటాం. కానీ, కాకి కూడా మాట్లాడటం ఎప్పుడైనా విన్నారా? మహారాష్ట్రలోని పాల్ఘర్ అనే ఊరిలో ఓ కాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎగిరి విన్యాసాలు చేస్తూ కాదు.. మనుషుల్లా మాట్లాడుతూ అది చేస్తున్న సందడి చూసి అందరూ అవాక్కవుతున్నారు.

నమ్మడం కష్టమే కానీ ఇది నిజం. ఈ కాకి మనుషుల గొంతుల్ని అనుకరిస్తూ మాట్లాడే వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిలకలా స్పష్టంగా మాట్లాడుతుంటే జనాలు నోరెళ్లబెడుతున్నారు.

అసలు కథ ఏంటంటే, మంగల్య ముంకే అనే వ్యక్తికి ఓ 15 రోజుల పసి కాకి చెట్టు కింద గాయాలతో కనిపించింది. వెంటనే దాన్ని ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా పెంచడం మొదలుపెట్టారు. అలా ఆ కాకి ముంకే కుటుంబంలో ఒక సభ్యురాలైపోయింది. పిల్లలు దానితో ఆడుకునేవారు, రోజూ తిండి పెట్టేవారు. అలా నెమ్మదిగా ఆ కాకి ఆ కుటుంబంతో బాగా కలిసిపోయింది. వాళ్ల భుజాల మీద కూర్చోవడం, ఇంట్లో అటూ ఇటూ తిరగడం.. ఆ తర్వాత మాట్లాడటం కూడా మొదలుపెట్టింది.

ఇప్పుడు ఆ కాకి వయసు సంవత్సరంన్నర. అది అచ్చంగా మనుషుల్లాగే పదాలు, వాక్యాలు మాట్లాడుతోంది. “అయి” (అమ్మ), “బాబా” అని పిలుస్తోంది. అంతేకాదు, ఏకంగా “ఏం చేస్తున్నావ్?”, “ఎందుకు ఇంటికి వచ్చావ్?” లాంటి పూర్తి వాక్యాలు కూడా మాట్లాడుతోంది.. అదీ కూడా అచ్చమైన మరాఠీలో, మొదటిసారి విన్నవాళ్లెవరైనా సరే షాక్ అవ్వాల్సిందే.

ఆ కాకి మాట్లాడుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్ల వాళ్లు కూడా ఆ కాకిని చూడటానికి, దానితో మాట్లాడటానికి ముంకే ఇంటికి క్యూ కట్టడం మొదలుపెట్టారు.

కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే.. ఆ పక్షి కేవలం మాటల్ని కాపీ కొట్టడం లేదు. నిజంగా మనుషులతో మాట్లాడుతోంది. ఎవరైనా కొత్తవాళ్లు వాళ్ల ఇంటి దగ్గరికి వస్తే, ఆ కాకి వెంటనే “ఏం పని మీద వచ్చావ్?” అని అడుగుతుందట. ఇంట్లో ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే, ఆ పేరుని మళ్లీ రిపీట్ చేస్తుంది.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అది రోజంతా మిగతా కాకులతో కలిసి ఎక్కడో ఎగిరిపోతుంది. కానీ, సాయంత్రమయ్యేసరికి కచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది. ఎక్కడికీ దూరంగా వెళ్లదు, అడవిలో తప్పిపోదు. తన ఇల్లు ఎక్కడో దానికి తెలుసు.

మంగల్య ముంకే మాట్లాడుతూ.. “మేం మొదట దానికి ఆపిల్ ఇచ్చాం. తర్వాత నెమ్మదిగా అన్నం పెట్టడం మొదలుపెట్టాం. అప్పటినుంచి అది మాతోనే ఉండిపోయింది” అని చెప్పారు. ఆయన భార్య తనూజా మాట్లాడుతూ.. “ఇప్పుడు అది మాతో మాట్లాడుతోంది, మమ్మల్ని పేర్లు పెట్టి పిలుస్తోంది. మేం దానికి ఏమీ నేర్పించలేదు.. అదంతట అదే నేర్చుకుంది” అని ఆశ్చర్యంగా చెప్పారు.

పాల్ఘర్ నుంచి వచ్చిన ఈ మాట్లాడే కాకి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇది నమ్మశక్యంగా లేకపోయినా.. మీరు స్వయంగా వింటే మాత్రం తప్పకుండా నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: