మన పెద్దలు ఎప్పుడూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెబుతూ ఉంటారు. మనం కష్టపడితే మాత్రమే విజయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఏ పని చేయకుండా ఇతరులు తమ అభివృద్ధికి కృషి చేస్తారని అనుకోవడమే సోమరితనం. సోమరిపోతులు ఏ పనీ చేయకుండా వ్యర్థమైన విషయాల గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. వాడకపోతే ఇనుమైనా తుప్పు పడుతుందని, ప్రవహించని నీరు పరిశుభ్రంగా ఉండదని అదే విధంగా సోమరితనం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలి.
మనుషులను క్రింది స్థాయిలోనే ఉంచే బలహీనత సోమరితనం. సోమరితనం మన కలలను, ఆశలను, ఆశయాలను, దూర దృష్టిని, ఆకాంక్షలను, కాలాన్ని, ప్రణాళికలను నాశనమయ్యేలా చేస్తుంది. మనం ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే సోమరితనాన్ని దూరం చేసుకొని కష్టపడాలి. గొప్పవాళ్ల ఆత్మకథల నుండి ప్రేరణను పొందాలి. ఈ ప్రేరణలు మనను లక్ష్యం వైపు అడుగులు వేసేలా చేస్తాయి.
మనం చేయగలం అని అనుకుంటే ఏ పనిలోనైనా విజయం సాధించవచ్చు. మనం ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని తరువాత చేద్దాంలే అని అనుకోకుండా ఆ పనిని ఇప్పుడే ఎందుకు పూర్తి చేయకూడదు అని మనను మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎన్నో లక్ష్యాలను సాధించాలని కలలు కంటూ ఉంటాం. ఆ లక్ష్యాలను సాధించడానికి ఈరోజు ఏం చేశామని మనను మనం ప్రశ్నించుకుంటూ సోమరితనాన్ని వీడి ముందడుగు వేయాలి. అప్పుడే జీవితంలో విజయాలను సాధించవచ్చు.