ప్రతి ఒక్కరికీ మంచి అలవాట్లు, చెడు అలవాట్లు రెండూ ఉంటాయి. మనకు ఉండే చెడు అలవాట్ల వలన చాలా సందర్భాలలో ఎక్కువ జీతం సంపాదిస్తున్నప్పటికీ ఆర్థికంగా ఎదగటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువ మంది పది తప్పులను చేస్తూ ఉంటారు. ఈ పది తప్పులను సరిదిద్దుకుంటే మాత్రం ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధించవచ్చు.
ఆర్థికంగా ఎదగాలనుకునేవారు ప్రతి నెలా ఆలస్యంగా బిల్లులు చెల్లించి జరిమానాలు కట్టకుండా జాగ్రత్త పడాలి. ఇలా చేయడం ద్వారా అనవసర జరిమానాల నుండి తప్పించుకోవచ్చు. ఏదైనా రుణం తీసుకున్నామంటే ఎట్టి పరిస్థితులలోను వాయిదాల చెల్లింపులను ఆలస్యం చేయకూడదు. ఏదైనా సమస్య నిజంగా ఉంటే రుణ సంస్థతో చర్చించి నిబంధనలలో మార్పులు చేయించుకోవడం ఉత్తమం. మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే ఆ బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తూ ఉండాలి.
జీతం వచ్చిన తరువాత ముందు పొదుపు చేసి మిగిలిన డబ్బులను ఖర్చు చేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా ఖర్చుల నియంత్రణ మన అదుపులో ఉంటుంది. బీమా తీసుకునే సమయంలో కూడా ఏ బీమా పడితే ఆ బీమా తీసుకోకుకుండా ఆదాయానికి ప్రత్యామ్నాయం చూపే బీమాలను తీసుకోవడం మంచిది. పన్ను ప్రణాళికలో హడావిడి పడకుండా ఏ పథకంలో మదుపు చేస్తే పన్ను రాయితీ కలుగుతుందో గుర్తించి ఆ పథకాల్లోనే మదుపు చేయాలి.
ఆరోగ్య బీమా తీసుకోవాలనుకుంటే కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా బీమా తీసుకుంటే మంచిది. ప్రతి నెలా అనవసరంగా వేటికి ఖర్చు పెడుతున్నామనే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. దీని వలన అనవసర ఖర్చులు తగ్గడంతో పాటు పొదుపు మొత్తం పెరుగుతుంది. పదవీ విరమణను దృష్టిలో ఉంచుకొని డబ్బు పొదుపు విషయంలో జాగ్రత్త వహిస్తే పదవీ విరమణ తరువాత ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని సందర్భాలలో ఊహించని ఖర్చులు వస్తాయి. అందువలన ఆ ఖర్చుల సమయంలో ఇబ్బందులు రాకుండా అత్యవసర నిధిని దాచుకుంటే మంచిది.