ప్రతి మనిషికి జీవితంలో ఓటమి నేర్పే గుణపాఠం చాలా గొప్పది. ఓటమికి ఎప్పుడూ భయపడకూడదు. ఓడిపోతే బాధపడకూడదు. జీవితంలో ఓడిపోయినప్పుడు కుంగిపోవడం, విజయం సాధించిన సమయంలో పొంగిపోవడం సరికాదు. ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపుఓటములు సహజం. ఓటమిని ఎల్లప్పుడూ విజయానికి తొలిమెట్టుగా భావించాలి. ఓడిపోయినవారే చరిత్రలో విజేతలుగా నిలిచారని గుర్తుంచుకోవాలి.
ఓటమిపాలవడంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే విజయం తప్పక సొంతమవుతుంది. జీవితంలో ఎదుర్కొనే కష్టాలు, కన్నీళ్లు మనకు అన్ని విషయాలను నేర్పిస్తాయి. ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవడం కూడా అంత సులువు కాదు. ఆ వైఫల్యాన్ని విశ్లేషించుకుని.. లోపం కనిపెట్టి.. దానిని నిజాయితీగా అంగీకరించాలి.
మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వహించుకుంటూ వెళితే ఓటమి తీవ్రత క్రమక్రమంగా తగ్గిపోయి విజయం తప్పక సొంతమవుతుంది. జీవితంలో విజయం నుంచి నేర్చుకునే విషయాల కంటే ఓటమి నుంచి నేర్చుకునే పాఠాలే విలువైనవి. ఓడిపోయిన సమయంలో ఎక్కడ తప్పు జరిగిందో పూర్తి స్థాయిలో విశ్లేషించుకోవాలి. ఒకవేళ తప్పు ఎక్కడ జరిగిందో అర్థం కాకపోతే మన స్నేహితులు, సన్నిహితుల ద్వారా మనం చేస్తున్న తప్పులను, పొరపాట్లను గుర్తించాలి. ఓడిపోయిన సందర్భంలో నిరాశానిస్పృహలకు లోను కాకుండా ప్రయత్నిస్తే ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది.