నేటి తరానికి ఈ టైటిల్ సరిగ్గా సూటవుతుంది. కారణం ఏదైనా.. అమ్మ నాన్నలను విస్మరించరాదు. అమ్మ-నాన్నలను మించిన ప్రత్యక్ష దైవం లేదు కదా.. కానీ వృద్దాప్యంలో అమ్మ నాన్నలకు ఓ పట్టెడు అన్నం పెట్టక ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన ప్రభుద్ధులను మనం ఎంతో మందిని చూస్తూ వున్నాం... ఇక నిస్సహాయ స్థితిలో కొడుకులు పట్టించుకోకుండా పోవడంతో రోడ్డున పడి పట్టెడు కూడు కోసం చేయి చాస్తున్న అమ్మలను మనం గమనించవచ్చు.
ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనను పరిశీలిస్తే.. మన గుండెలు ఛిద్రమవ్వక మానవు. వృద్దాప్యంలో ఆమె పడుతున్న వేదన చూస్తే ఎవరికైనా కళ్లు చెమర్చక మానవు. ఆమే.. 80 ఏళ్లు వయస్సు కలిగిన "అనంతుల లక్ష్మమ్మ" యాదాద్రి, భువనగిరి జిల్లా, మోట కొండూరు మండలంలోని ముత్తి రెడ్డి గూడెం గ్రామానికి చెందిన లక్ష్మమ్మను, తమ పిల్లలు... ఇంటి నుంచి గెంటేయడంతో నడిరోడ్డులో దిక్కు తోచని ఆమె పరిస్థితి చూస్తే... ప్రపంచం ఎటు పోతుందో అనే అనుమానం మనకు కలగక మానదు.
తన పిల్లలను కంటికి రెప్పలా సాకింది లక్ష్మమ్మ. ఇక ఆమె భర్త నుండి వచ్చిన 70 ఎకరాల భూమి... ఇతర ఆస్తుపాస్తుల్ని కూడా ఆమె సంరక్షిస్తూ వచ్చింది. కానీ ఆమె పిల్లలు పెరిగి పెళ్లిళ్లు చేసుకున్నాక లక్ష్మమ్మ నుంచి ఆస్తిని లాక్కుని, ఆస్తిని పంచుకొని ఆమెను నిర్దాక్షిణ్యంగా రోడ్డుపైకి నెట్టేశారు. పాతికేళ్ళ క్రితం లక్ష్మమ్మ భర్త కాలం చెల్లడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. మొదట్లో నెలకు ఒక్కరు పోషించేలా పెద్దలు ఒప్పందం చేశారు. కానీ క్రమేపి.. అమ్మ భారం అని భావించిన ఆమె కొడుకులు, ఆమెకు అన్నం పెట్టలేమంటూ లక్ష్మమ్మను ఇంటి నుంచి గెంటేశారు. స్థానికులను ఈ దృశ్యం ఎంతో కలచివేసింది.
ఇక ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వృద్ధాప్యంలో ఉన్న ఆ అవ్వ.. కొన్ని రోజులుగా చెట్టు క్రింద బిక్కుబిక్కుమంటూ బ్రతుకునీడుస్తోంది. ఇది చూసి స్థానికులు చలించిపోతున్నారు కానీ ఆ కొడుకులుకి ఏమాత్రం చలనం లేదు. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు అని అర్ధం.. కానీ నేడు సుపుత్రులు.. మాత్రం బతికుండగానే తల్లి దండ్రులకు నరకం చూపిస్తున్నారు. నేటి తరం వారి సౌఖ్యాలకోసం... జీవితపు చివరాఖరకు చేరుకున్న అమ్మ నాన్నలను అడ్డుగా భావిస్తున్నారు.. ఇది ఎంతో అమానుష చర్య!!