జీవితంలో ఏ పనిలోనైనా సక్సెస్ సాధించాలంటే ఓర్పు, ఏకాగ్రత ఉండాలి. ఈ రెండూ ఉన్నవారు ఆలస్యంగానైనా సక్సెస్ అవుతారు. సాధారణంగా మనం ఇష్టమైన వాటిపై ఎక్కువగా ఏకాగ్రత చూపిస్తాం. కానీ పుస్తకాలు పట్టుకోవాలన్నా, పని చేయాలన్నా ఏకాగ్రత రాదు. ఏ పని చేస్తున్నా ఆ పనిలో ఎంత నిమగ్నమై ఉన్నామన్న దానిని బట్టి ఆ పనిపై ఎంత ఏకాగ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు. చేస్తున్న పనిలో పూర్తిగా లీనం అవడాన్ని ఏకాగ్రత అంటారు.
ఏకాగ్రత లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి మనకు సమయం వృథా అవుతుంది. ఏకాగ్రతను అలవరచుకుంటే పని మీద ధ్యాస కుదిరి మంచి ఫలితాలు వస్తాయి. ఏకాగ్రత లేని వారు బద్ధకస్తులు అయ్యే అవకాశం ఉంది. ఏకాగ్రతకు ఓర్పు తోడైతే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏకాగ్రతతో కష్టపడి ఒకింత ఓర్పు వహిస్తే విజయం తప్పక సొంతమవుతుంది. జీవితంలో ఓర్పు, ఏకాగ్రతను సాధించాలంటే ముందుగా రోజులో చేయాల్సిన అతి ముఖ్యమైన పనులను గుర్తించాలి.
మొబైల్, టీవీకు వీలైనంత సమయం దూరంగా ఉండాలి. ఒకసారి ఒక పనిని మాత్రమే చేయాలి. ఒకేసారి ఎక్కువ పనులు చేయడం వల్ల అనుకున్న ఫలితాలు రావు. మీరు చేయాల్సిన పనులన్నీ అనుకున్న విధంగా పూర్తి చేస్తే ఓర్పు, చక్కటి ఏకాగ్రత మీ సొంతమవుతుంది. ఈ రెండూ సొంతమైతే జీవితంలో ఏ పని చేపట్టినా విజయం తప్పకుండా సొంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.