చాలా మంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారు. కొందరు కష్టపడి ఉద్యోగాలు సాధిస్తే మరికొంతమంది సమయాన్ని వృథా చేస్తూ ఉంటారు. ఉద్యోగం ఎందుకు రాలేదనే ప్రశ్నకు చిత్రవిచిత్రమైన కారణాలు చెబుతూ ఉంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం, లక్ష్యాలను సాధించడం అంత తేలిక కాదు. ఎంతో కష్టపడితే మాత్రమే కెరీర్ లో విజయం సాధించడం సాధ్యమవుతుంది. 
 
రాని అవకాశాల కోసం ఎదురుచూడటం కంటే కొత్త అవకాశాలను సృష్టించుకోవడం ఎంతో ముఖ్యం. మరికొంతమంది కెరీర్ మొదట్లో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కావాలని చిన్న చిన్న కంపెనీలలో అవకాశం వచ్చినా వద్దని చెబుతూ ఉంటారు. అవకాశాలు లేని చోట సృష్టించుకున్నవారే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. మనలో ఉండే ఆశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే కోరికను పుట్టిస్తుంది. 
 
మన కోరికలే లక్ష్యంగా మారి మనలో విశ్వాసాన్ని నింపి విజయతీరాలకు చేరుస్తాయి. మనలోని ఆలోచనలను మనం నమ్ముతూ... అవకాశాలను ఎవరికి వారు సృష్టించుకోవాలి. ప్రతిభకు తగిన అవకాశాలను సృష్టించుకుంటూ కెరీర్ లో ముందడుగులు వేయాలి. అలా కాకుండా అవకాశాలు రాలేదని కెరీర్ లో విలువైన సమయాన్ని వృథా చేస్తే జీవితాంతం బాధ పడాల్సి వస్తుంది. 
 
కొందరు తమకు తక్కువ మార్కులు వచ్చాయని మంచి ఉద్యోగాలు పొందలేమని నిరాశ పడుతూ ఉంటారు. ప్రతిభ ఉంటే తక్కువ మార్కులు వచ్చినవారు కూడా మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. మనపై మనకు నమ్మకం ఉండి కష్టపడే తత్వం ఉండి అవకాశాలను సృష్టించుకోగలిగితే విజయం సొంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో అవకాశాలను సృష్టించుకున్నా ఓడిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో నిరాశానిస్పృహలకు లోను కాకుండా జరిగిన పొరపాట్లను గుర్తించి ప్రయత్నిస్తే సక్సెస్ సులభంగా సొంతమవుతుంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: