ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి చూపే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. యువతలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల పట్ల ఆకర్షితులవుతున్నారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకు పరీక్షలు, వివిధ రకాల కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చడానికో, స్నేహితుల ప్రభావం కారణంగానో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే విజయం సాధించే అవకాశాలు తక్కువ.
సరైన మార్గదర్శకత్వం ద్వారా మాత్రమే పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించడం సాధ్యమవుతుంది. పోటీ పరీక్షలకు హాజరవుతున్న వారు సరైన మార్గదర్శకత్వం లేక తొలి ప్రయత్నంలో ఓటమిపాలవుతున్నారు. అధ్యాపకులు, సీనియర్లు, శిక్షణా సంస్థల సహాయం తీసుకుంటే పోటీ పరీక్షల్లో తక్కువ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. కొన్నిసార్లు పరీక్షల్లో ఫెయిల్యూర్ వచ్చినా ఆ ఫెయిల్యూర్ ను సుదీర్ఘ ప్రయాణంలో భాగంగానే చూడాలి.
సరైన వ్యూహం ఎంచుకోకపోయినా, తగిన ప్రణాళిక వేసుకోలేకపోయినా, తీసుకున్న శిక్షణలో తగిన ప్రమాణాలు లేకపోయినా పోటీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ. పోటీ పరీక్షల్లో పరాజయానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. వ్యక్తిగత కారణాలు, పోటీ పరీక్ష సన్నద్ధతలో విషయపరమైన లోపాల వల్ల చాలామంది సక్సెస్ కు దూరమవుతూ ఉంటారు. ఒక్కో తరహా పోటీ పరీక్షకు ఒక్కో ప్రత్యేక పంథాలో సన్నద్ధత అవసరం.
అందువల్ల పరీక్షకు తగ్గట్టుగా దినచర్యను అలవాటు చేసుకోవాలి. క్రమశిక్షణ అలవరుచుకుని ప్రయత్నిస్తే విజయం సులభంగా సొంతమవుతుంది. మనలో చాలామంది వ్యక్తిగత బలహీనతల కారణంగా క్రమశిక్షణ తప్పడం వల్ల విజయానికి దూరమవుతూ ఉంటారు. మరికొంత మంది పోటీపరీక్షకు అంకితమై ఏళ్ల తరబడి ప్రయత్నిస్తున్నా సత్ఫలితం రాదు. వ్యక్తిగత కారణాల కంటే సన్నద్ధత పర్వంలో చేసిన పొరపాట్లే ఇలాంటి వారి విషయంలో ఫెయిల్యూర్ కు కారణమవుతాయి. సరైన ప్రణాళికతో ఇతరుల సూచనలను పాటిస్తూ పొరపాట్లను ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే విజయం సులభంగా సొంతమవుతుంది.