
మీరు ఇంకా మంచి ఉద్యోగం సంపాయించుకుని ఉంటే బాగుండేది!- అని ఎవరితోనైనా అంటే.. అబ్బే.. పెద్దగా చదువుకోలేదు సార్. ఇంతకన్నా ఇంకేమొస్తుంది.. చెప్పండి!! అని నిర్లిప్తత వ్యక్తం చేస్తారు. కానీ, ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కోటి గ్రూప్ ఆఫ్ వెంచెర్స్ అధినేత సరిపల్లి కోటిరెడ్డి.. మాత్రం.. ఎంత చదివామ న్నదికాదు.. ఎంతగా దూసుకు పోయామన్నదే ముఖ్యమని అంటారు. ప్రస్తుతం 162 దేశాల్లో కోటి రెడ్డి గ్రూ ప్ టెక్నాలజీ పరంగా సేవలు విస్తృతం చేసింది. దీంతో 70 కోట్ల మంది ప్రజలకు ఈ సేవలు అందుతు న్నాయి అంతేకాదు, అత్యంత తక్కువ ధరలకే ఆయా సేవలు అందుతున్నాయి. అయితే, ఈ మొత్తం కృషి వెనుక కోటిరెడ్డి ఆశయం.. లక్ష్యం ఉన్నాయి.
నిజానికి ఆయన ప్రాథమిక విద్యతోనే సరిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కుటుంబ కారణాలు కావొచ్చు. ఆర్ధిక సమస్యలు కావొచ్చు.. ఆయన పదో తరగతితోనే ఆపుచేయాల్సిన పరిస్థితి! ఇదే స్థితి వేరేవారికి ఎదురైతే.. ఇక.. చదివింది చాలు.. కూలోనాలో చేసుకుందామని అనుకుంటారు. కానీ, పట్టుదలతో ముందుకు సాగారు కోటిరెడ్డి. ప్రాథమికంగా తాను చదవింది పదోతరగతే అయినప్పటికీ.. మానసికంగా ఆయన అడుగులు మాత్రం టెక్నాలజీ దిశగా పడ్డాయి. ఫలితంగా ఆయన టెక్నాలజీ రంగంలో దూసుకుపోయారు. సంచనాలకు వేదికగా మారారు. చదివింది తక్కువే అయినా.. సంచనాల సృష్టికి కృషి చేశారు.
కృషి ఉంటే.. మనుషులు రుషులవుతారు.. అన్న సూత్రాన్ని ఆచరణలో చేసి చూపించారు కోటిరెడ్డి. ఒక ఆలోచనకు చదువు కావాలేమో.. కానీ, ఒక ఆశయానికి మాత్రం వ్యూహాత్మక కృషి.. కష్టపడే తత్వం కావాలని నిరూపించారు. అవమానాలను సైతం అధిగమించే లక్షణాన్ని పుణికి పుచ్చుకున్నారు. తనకు ఎదురైన ప్రతి బంధకాలను సోపానాలుగా చేసుకుని ముందుకు సాగారు. ఓ మారు మూల గుడివాడ ప్రాంతంలో డీజీ డీసీఏ నేర్చుకున్న పల్లెటూరు యువకుడు.. తర్వాత కాలంలో అనేక కష్టనష్టాలకు ఓర్చుకుని.. తనదైన ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా.. ముందుకు సాగారు.
మైక్రోసాఫ్ట్‌లో అడుగు పెట్టారు. ఇక్కడే తనలోని లోపాలను ఎత్తి చూపుతున్నా.. వాటిని అబివృద్ధికి ఆలవాలంగా మార్చుకున్నారు. లోపాలను సరిచేసుకున్నారు. సంస్థ ఎదుగుదలలో తన వంతు పాత్రను పోషించారు. అనంతరం తనే సొంతగా కంపెనీని ప్రారంభించారు. దీనిని విస్తరించే ప్రయత్నంలో ఎదురైన కష్టాలను కూడా ఎదుర్కొని దీటుగా నిలబడి రాటుదేలారు. ఇలా.. మొత్తంగా తనదైన లక్ష్యం దిశగా వేసిన అడుగులు చదువుతో నిమిత్తం లేకుండా సక్సెస్ దిశగా సాగేలా చేశాయి. ప్రపంచంలోనే ఒక ఐకాన్‌గా కోటిరెడ్డిని నిలబెట్టాయి. ఇదే .. కోటిరెడ్డి డైరీలో నూతన అధ్యాయాన్ని లిఖించేలా చేసింది. ఈ ప్రపంచానికి ఓ సమర్థుడు, సంచలనాలకు మారుపేరు అయిన టెకీని అందించింది.