మీ జీవితం ఎలా ఉండాలని అనుకుంటున్నారు!- అని ఎవరినైనా అడిగితే.. ఠక్కున చెప్పే సమాధానం.. సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను! అనే చెబుతారు. కానీ, ఎక్కడో వందలోనో వెయ్యిలోనొ ఒక్కరిద్దరు మాత్రమే.. లక్ష్యం సాధించాలనుకుంటున్నాననే సమాధానం వస్తుంది. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు.. యుక్త వయస్సులోనే సంచలనాలు క్రియేట్ చేసిన ఘనత సొంతం చేసుకున్న మన తెలుగు వ్యక్తి సరిపల్లి కోటిరెడ్డి. జీవితం వడ్డించిన విస్తరి కాదు.. అనే సూత్రం .. ఈయన జీవితంలో అక్షరాలా మనకు కనిపిస్తుంది. ఎక్కడో కృష్ణాజిల్లా గుడివాడలో ఓ మారు మూల కుగ్రామంలో రైతు కుటుంబంలో ఇద్దరు అక్కల తర్వాత జన్మించిన కోటిరెడ్డి జీవితం నేడు ప్రపంచ ప్రఖ్యాతం.
అయితే, పైన చెప్పుకొన్నట్టు ఆయన జీవితం ఏమీ వడ్డించిన విస్తరి కాదు! ఒడిదుడుకుల ప్రస్థానంలో ఆయన ఎదుర్కొనని కష్టాలు లేవు. ఆయన అనుభవించని సమస్యలు లేవు. అయినా కూడా కష్టాలనే ఇష్టాలుగా భావించారు. సమస్యలనే సోపానాలు చేసుకుని ముందుకు సాగారు. జాయ్ ఆఫ్ జర్నీ అనే సూత్రాన్ని ఒంటబట్టించుకుని అడుగులు ముందుకు వేశారు. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుందని నమ్మారు. అవే ఆయనను ముందుకు నడిపించాయి. ప్రతి ఓటమి నుంచి ఆయన విజయాన్ని అందు కున్నారు. ఇంగ్లీష్ రాదా? అని గేలి చేసిన వారితో అద్భుతంగా ఇంగ్లీష్‌లో సంభాషించి మెప్పించారు.
కేవలం పది పాస్ అయ్యి అక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ లో కీలక ఉద్యోగం వరకు వెళ్లారు. ఆ తర్వాత తాను పుట్టిన భారతదేశానికి, అక్కడ ప్రజలకు సేవ చేయాలని ఇండియాకు తిరిగి వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజు 14 కంపెనీలకు అధిపతి అయ్యి వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. కేవలం నాలుగు గోడల మధ్య తన జీవితం బంధీ అవడాన్ని ఆయన జీర్ణించుకోలేక పోయారు. తనే ఒక సంస్థగా ఎదిగారు. తాను పెట్టిన దీపం తనతో పాటు మరింత మందికి వెలుగు పంచాలని అభిలషించారు. అదే ఆయనను ఆయన సంస్థలను ముందుండి నడిపించింది.
ఈ జర్నీ ఇక్కడితో ఆగిపోయి.. నేను రెస్ట్ తీసుకుంటాననే భావన ఆయనలో ఎక్కడాపొడ సూపలేదు. అవిశ్రాంత శ్రామికుడులా ఆయన డిటిజల్ ప్రపంచంలో చక్కర్లు కొట్టారు. అసాధ్యాలను సుసాధ్యం చేసుకున్నారు. జాయ్ ఆఫ్ జర్నీకి కొత్త అర్ధం చెప్పారు. నిత్య పరిశీలకుడిగా, నిరంతర విద్యార్థిగా తాను నడిపిస్తూ.. తన సంస్థలను నడిపిస్తున్నారు. అదే కోటిరెడ్డి విజయ పరంపరకు ప్రస్థానంగా మారి.. ఈ సమాజాన్ని సరైన దిశగా అడుగులు వేసేలా చేస్తోంది.