కోటిరెడ్డి.. దాదాపు 14 కంపెనీలకు అధిపతి.. 700 కోట్లకుపైగా టర్నోవర్.. వయస్సు మాత్రం 36 ఏళ్లే.. ఈ నాలుగు ముక్కలు చెప్పగానే.. ఆయన గురించి తెలియని వారు ఆయన్నో బిజినెస్ మాగ్నెట్ గా ఊహించుకుంటారు. అసలు ఇలాంటి వాళ్లు మనతో మాట్లాడతారా అని ఫీలవుతారు. కానీ.. ఒక్కసారి ఆయనతో పరిచయం అయితే ఇక ఆశ్చర్యపోవడం ప్రారంభిస్తారు.

 

 

తన సంస్థలో పనిచేసే ఓ చిన్న ఉద్యోగినైనా.. తమరు అంటూ గౌరవంగా సంభోదిస్తారు. మొదటి సారి ఆయనతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు నిజంగా ఆశ్చర్యపోతారు. అసలు ఓ పారిశ్రామిక వేత్త ఇంత సౌమ్యంగా ఎలా మాట్లాడగలరా అనిపించకమానదు. కంఠంలో శ్రావ్యత, సంభోదనలో మార్ధవం, ఉచ్ఛారణలో గౌరవం ఆశ్చర్యపరుస్తాయి. ఏదో టెక్నాలజీ మనిషి కదా.. అందులోనూ పారిశ్రామికవేత్త కదా అనుకుంటే.. ఆయనకు సాహిత్యంపై ఉన్న పట్టు చూసి షాకవ్వడం ఖాయం.

 

 

వేటూరి వారి పాట గురించి ఎంత లాలనగా చెప్పగలరో.. జర్నలిస్టు ఎన్‌కౌంటర్ దశరథరామ్‌ గురించీ అంతే సాధికారికంగా మాట్లాడగలరు. ఇక ఆయనతో పని చేయడమంటే.. కాలంతో పరుగులు పెట్టడమే. ఎవరైనా కాలాన్ని గంటలు, నిమిషాల్లో కొలుస్తారు.. కానీ కోటి రెడ్డి దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఆయన తన పని గంటలను సెకన్లలో విభజించుకుంటారు. జెట్ స్పీడుతో పనులు సాగిపోవాలన్నది ఆయన అభిమతం. మళ్లీ నాణ్యతలో రాజీ అన్నదే ఉండదు.

 

 

అన్నింటికంటే.. ఆయనకు ఎక్కువ మార్కులు మానవత్వం కోణంలో పడతాయి. సార్.. ఇదీ పరిస్థితి అని చెప్పగానే.. ఆ విజ్ఞప్తిలో వాస్తవం ఉందంటే.. నిమిషాల్లో సాయం అందుతుంది. కోట్లు సంపాదిస్తూ కూడా అందులో 33 శాతం సమాజానికి ఇచ్చే మంచి మనసు ఎందరికి ఉంటుంది.. చిన్న వయస్సులోనే ఉన్నత శిఖరాలు అధిరోహించిన కోటి.. మరింత ఎత్తుకు ఎదగాలి. కోట్లాది మందికి కోటి గ్రూపు సేవలు అందాలి. మానవత్వపరిమళాలు మరింతగా వెదజల్లాలి. జన్మదినవేళ ఇదే మా శుభకామన.

మరింత సమాచారం తెలుసుకోండి: