మనలో చాలామంది చదువు పూర్తయినా ఉద్యోగం దొరకని పరిస్థితిలో ఉన్నారు. మరికొంతమంది ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనుకుంటున్నారు. కంపెనీలు మాత్రం సరైన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరకడం లేదని చెబుతున్నాయి. అయితే మనం చదివిన చదువుకు, ప్రతిభకు తగిన ఉద్యోగం చేస్తున్నామా....? అంటే చాలామంది కాదనే సమాధానం చెబుతారు. ఫలితంగా ఉద్యోగంలో అసంతృప్తితో కొందరు చేసే ఉద్యోగం నచ్చక మళ్లీ ఉద్యోగ వేటలో పడతారు. 
 
మరికొంతమంది ఉద్యోగం నచ్చకపోతే ఆ ఉద్యోగం మానేసి మళ్లీ సరిపడని ఉద్యోగంలో చేరి అదే తప్పును పునారావృతం చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రతిభ, సమయం, వయసు వృథా అవుతాయి. ఇలాంటి సమస్యలు రాకుండా కెరీర్ లో సక్సెస్ సాధించి బంగారు భవిష్యత్ ను సొంతం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మనం ఏదైనా ఉద్యోగంలో చేరాల్సి వస్తే చేరే ముందు ఒకసారి ప్రశ్నించుకోవాలి. 
 
మనం వేసుకున్న అన్ని ప్రశ్నలకు సమాధానం ఓకే అనిపిస్తే ఆ ఉద్యోగంలో చేరాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగాన్ని చేయడంతో పాటు చేసే వృత్తిలోనూ రాణించే అవకాశాలు ఉంటాయి. అన్ని ప్రశ్నలకు నో అనే సమాధానం వస్తే ఆ ఉద్యోగంలో చేరకపోవడమే మంచిది. ప్రతిభ ఉన్నవారికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటాయన్న విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. తాత్కాలిక అవసరాల కోసం ఏదో ఒక ఉద్యోగంలో చేరితే విలువైన కాలంతో పాటు బంగారు భవిష్యత్ ను నష్టపోవాల్సి వస్తుంది. 
 
దీర్ఘకాలిక ఉద్యోగంలో చేరుతున్నట్లయితే కొన్నాళ్ల తర్వాత వచ్చే ప్రయోజనాలేంటో ముందే ఆలోచించుకుని ఉద్యోగంలో చేరాలి. అనుభవం పెరిగే కొద్దీ వృత్తిలో అభివృద్ధి ఉంటుందా లేదా అన్నది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో విజయానికి తగిన వనరులను సంస్థ సమకూర్చగలదా...? లేదా...? చూసుకోవాలి. మన ప్రతిభ, నైపుణ్యాలను సంస్థ సద్వినియోగం చేసుకుంటుందా...? లేదా...? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. భవిష్యత్తులో ఒకవేళ సంస్థను వదిలివెళ్లినా అక్కడి ఉద్యోగ అనుభవం, ప్రతిభ, నైపుణ్యాలు మంచి అవకాశాలను కలిగిస్తాయా...? అని ఆలోచించి ముందడుగులు వేస్తే సక్సెస్ సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: