కాలం మారుతోంది. మారుతున్న కాలంతో పాటే చాలా కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ఫోన్ ఇంటర్వ్యూ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఈ విధానం ద్వారా కంపెనీలకు సమయం, వ్యయం రెండూ ఆదా అవుతాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడానికి ముందుగానే.. ఒకసారి ఫోన్‌లో వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి. ఫోన్ ఇంటర్వ్యూలో అభ్యర్థి నైపుణ్యాలను పరిశీలించి తుది ఇంటర్వ్యూలకు పిలుస్తున్నాయి.
 
టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఉద్యోగం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తగిన అభ్యర్థి అని భావిస్తే మాత్రమే సంస్థ ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తుంది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. ఇంటర్వ్యూ చేసే అభ్యర్థిని మనం చూడలేం కాబట్టి ఇంటర్య్వూలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి చేప్పే విషయాలను నిశితంగా వినాలి.
 
చాలామంది ప్రశ్న అర్థం కాకపోవడం వల్ల టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో పొంతన లేని సమాధానాలను చెబుతూ ఉంటారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడిగే ప్రశ్నలను స్పష్టంగా అర్థం చేసుకుని సమాధానాలు ఇవ్వాలి. అలా చేయకపోతే ఇంటర్వ్యూపై మీకు ఆసక్తి లేదు అనే భావన అవతలి వ్యక్తికి కలిగే అవకాశం ఉంది. సంస్థ ముందే అభ్యర్థికి ఇంటర్వ్యూ గురించి తెలియజేస్తుంది కాబట్టి మొబైల్‌ ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ ఉండేలా చూసుకోవాలి.
 
ఫోన్ సిగ్నల్స్‌ స్పష్టంగా ఉండేలా ఇంటర్వ్యూ ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఫోన్ ఇంటర్వ్యూ ప్రారంభం కాకముందే అభ్యర్థి అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. అలా చేస్తే ఇంటర్వ్యూ సమయంలో కొన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పవచ్చు. ఫోన్ మాట్లాడే సమయంలో లౌడ్ స్పీకర్ ఆన్ చేయకూడదు. ఫోన్ ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగానే తుది ఇంటర్వ్యూకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోన్ ఇంటర్వ్యూల్లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం, సమయస్ఫూర్తి అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: