మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, పరిస్థితులు తలకిందులైనా మనకి తెలిసిన బంధువులో, తెలిసిన వాల్లో, స్నేహితులో పలకరించడానికి వచ్చి "ఏం జరిగినా మన మంచికే, లైట్ తీసుకో" అంటారు. కానీ అదే పరిస్థితి మనకి ఎదురైతే ఉక్కిరిబిక్కిరవుతారు. అందుకే ఏదైనా మనవరకూ వస్తేగాని తెలియదు అంటారు. జీవితంలో గెలవాలని ప్రయత్నించిన ప్రతీ వారికీ ఆటుపోట్లు, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగని ఆగినచోటే ఉండిపోతే గెలుపు గమ్యాన్ని చేరలేము. కష్టాలన్నీ నాకే వస్తున్నాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది, నాకు అదృష్టం లేదు అని అనుకొని ఎక్కడవేసిన గొంగళి అక్కడే అణా చందంగా ఉంటే ఏమీ సాధించలేము. ఎదో సినిమాలో చెప్పినట్టు గెలుపు అంటే పులిస్టాప్ కాదు అది ఒకచోట ఆగిపోకూడదు అని.


 అలాగే ఎదగాలి అంటే ఉన్నచోటే ఉండటం కాదు అవకాశాల రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడం. సాధారణంగా మనలో చాలామంది తాము ఉన్నచోటునుంచి మరొక చోటుకు వెళ్లడానికి కాని, చేస్తున్న ఉద్యోగంనుంచి మరొక ఉద్యోగంలోకి మారడానికి కాని సాహసించరు. ఒకవేళ చేస్తున్న ఉద్యోగంలో బదిలీ అయినా వెళ్లడానికి ఇష్టపడరు. దీనికి కారణం ఇన్నాళ్లుగా అలవాటయిన ప్రదేశాన్ని, స్నేహితులను విడిచి కొత్త ఊళ్లో, ఎవరూ తెలియనిచోట మళ్లీ మొదట్నించి జీవితాన్ని ఆరంభించాల్సి వస్తుందనే భయం ప్రధాన కారణం. సమస్య ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోలేకపోవడం, దానినుంచి పారిపోవడానికి ప్రయత్నించడం సాధారణంగా కనిపించే అంశమే. అయితే అవకాశం వచ్చినప్పుడు దానిని సద్వినియోగపరచుకోవడం ముఖ్యం. గెలిచిన వాడికి ఓడిన వాడికి ఒక్క అడుగే తేడా కానీ ఆ ఒక్క అడుగు ముందుడటం వెనుక నిరంతర ప్రయత్నం, కృషి, పట్టుదల ఉంటాయి.


సాకులు చూపించో, నా వల్ల కావడం లేదనో అని మనకు మనమే నిరాశపడి తప్పంతా ఆ దేవుడిపైన వేసేసి నా ప్రయత్నం నేను చేసాను అని తప్పించుకుపోవడం చేతకాని వాడి లక్షణం. మనం ఎప్పుడైతే నేను చేసి తీరుతాను అని గట్టిగా సంకల్పిస్తామో అప్పుడే విజయం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ కిక్ ఎంటో తెలియాలి అంటే ఒక్కసారి గెలిచిన వాడి గురించి కాదు వందసార్లు ఓడి గెలిచిన వాడి కథలను చదవండి మీకే అర్థమవుద్దీ అలాంటి గెలుపులో ఉండే మజా ఎంటో. ఇప్పటికి కూడా నాకు గెలవాలి అని అనుకునే వారు సమాజంలో తప్పులు చూపించకుండా మీలో ఉన్న తప్పుల్ని గుర్తించండి. మనం ముందు మనలో ఉన్న బలహీనతల్ని గెలిస్తే విజయం ఆటోమేటిక్ గా మనల్ని వరిస్తుంది... ఆల్ ది బెస్ట్..

మరింత సమాచారం తెలుసుకోండి: